ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, సభ్యులు మెతుకు ఆనంద్, డాక్టర్ సంజయ్‌తో పాటు హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు మాగంటి గోపినాథ్‌ను గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? అని కేటీఆర్ నిలదీశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే, స్వయంగా డాక్టర్లు అయిన మా నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
Admin
Aakanksha News