ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : సింగరేణి ఏరియాలోని 11 డివిజన్ల నుంచి వచ్చిన హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత, సింగరేణి ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తెచ్చారు. హైదరాబాదులోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్ఎంఎస్ సింగరేణి జాగృతి కార్యకర్తలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, సింగరేణి అనేది తెలంగాణ కొంగు బంగారం అని అభివర్ణించారు. నాడు కరువు కాటకాలతో ఉన్న రాష్ట్రానికి బొగ్గు బాయి అన్నం పెట్టిందని, మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదమే సింగరేణి అని అన్నారు. ఒకప్పుడు పరుగు పందాలు పెట్టి సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను కాపాడిన చరిత్రను స్మరించుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచే బొగ్గు తవ్వకాలు ప్రారంభమైనప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎదుర్కొన్న కష్టాలు అందరికీ తెలుసని చెప్పారు.ప్రస్తుతం సింగరేణి ప్రాంతాల్లో అన్ని జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తూ, సంస్కృతుల కలయికతో మినీ ఇండియాలా కనిపిస్తాయని పేర్కొన్నారు. కలలకూ, సంస్కృతికీ నిలయమైన ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు పోకుండా కాపాడాలని, సింగరేణి సంస్థను రక్షించుకోవడం అవసరమని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనే నిర్ణయం మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్నారని, ఇది కుటుంబాల ఆర్థిక భద్రతకు ఎంతో తోడ్పడిందని చెప్పారు. ప్రస్తుతం 40,000 మంది కార్మికులతో సింగరేణి ఉత్సాహంగా నడుస్తోందని తెలిపారు.ఇప్పటి నుంచి హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి జాగృతి అన్ని డివిజన్లలో క్రమబద్ధంగా పనిచేస్తుందని, కార్మికుల హక్కుల కోసం, వారికి రావాల్సిన సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని కవిత హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 15–18% మాత్రమే తీయగలిగామని, ఇంకా విస్తారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. సంవత్సరానికి 5 బొగ్గు బావులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ఇంకా 180 నూతన బొగ్గు బావుల అవకాశముందని తెలిపారు. దీని ద్వారా నిరుద్యోగ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చని, నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.గతంలో సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సిన లాభాల వాటా తగ్గించి మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈసారి 35% లాభాల వాటా చెల్లించాలనీ, సింగరేణి లాభాలను పారదర్శకంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల చెమటతో తడిసిన బొగ్గు దేశానికి వెలుగునిస్తోందని, ప్రాణాలను తెగించి మరి పనిచేసే ఈ కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేసి, వర్క్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.సింగరేణి కార్మికుల హక్కుల కోసం క్రమంగా పోరాటం చేసిన రియాజ్ అహ్మద్ పేరును ప్రస్తావించిన కవిత, ఆయన సింగరేణి వ్యాప్తంగా ముందుండి ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఇకపై హెచ్ఎంఎస్‌తో జాగృతి కూటమి కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని కవిత ప్రకటించారు.
Admin
Aakanksha News