ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బెంగళూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో మార్చిలోనే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.నీటి సంక్షోభంలో నగరం విలవిలలాడుతోంది. నీటి కోసం పొడవాటి క్యూల్లో వేచిఉండాల్సి వస్తోందని ఆర్ఆర్ నగర్ వాసులు వాపోతున్నారు. స్ధానికులు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటంతో అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు.కొద్దిపాటి నీటితోనే ఇంట్లో వారంతా సర్దుకోవాల్సి వస్తోందని అంటున్నారు. స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు కూడా తగినంత నీరు ఉండటం లేదని మహిళలు నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. గత మూడు నెలలుగా నీటి కొరత వెంటాడుతోందని తాము నిత్యం బీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్) అధికారికి ఫోన్ చేస్తున్నా ఫలితం లేదని చెప్పారు. తాను ప్రతిరోజూ తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్‌కు వస్తున్నానని, ఇక్కడకు కేవలం ఒక వ్యక్తినే అనుమతిస్తున్నారని గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వివరించారు.ప్రైవేట్ ట్యాంకర్లు గతంలో క్యాన్‌కు రూ. 600-రూ.1000 వసూలు చేయగా ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రూ. 2000కుపైగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్యాంకర్లను ధర తగ్గించాలని ప్రభుత్వం కోరిన తర్వాత వారు తమ ప్రాంతానికి రావడం నిలిపివేశారని తెలిపారు. ప్రతిరోజూ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపుతున్నా స్పందన లేదని వాపోతున్నారు.
Admin
Aakanksha News