ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేద్దాం అని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని చెప్పారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని..బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో గొప్ప పనులు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం తప్పకుండా చేస్తోందన్నారు.
Admin
Aakanksha News