ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : సింగరేణిలో ఉద్యోగం చేసి రూపాయి రూపాయి సంపాదించుకొని పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపే సమయంలో అనుకోని సంఘటన తో వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి కథ సుఖంతం అయింది. అయితే తమకు న్యాయం చేసిన రామగుండం సీపీ రేమా రాజేశ్వరికి గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన రావుల మల్లయ్య 30 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేసి ఇటీవల పదవి విరమణ పొందారు. అయితే పదవి విరమణ అనంతరం వచ్చిన కొంత నగదు బంగారాన్ని ఇంట్లో ఉంచడంతో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో ఉన్న బంగారు నగలతో పాటు నగదును అపహరించారు. ఈ విషయంపై బాధితులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రామగుండం సీపీ రేమా రాజేశ్వరి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాల్వ శ్రీరాంపూర్ లో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న పవన్ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా సుల్తానాబాద్ లోని అల్లిపూర్ గ్రామంలో దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితుడు నుండి చోరీకి గురైన బంగారం, వెండి , నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రావుల మల్లయ్య కుటుంబానికి సీపీ అందజేశారు. దీంతో బాధితులు సీపీ రేమా రాజేశ్వరి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డున పడే మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన సీపీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం రోడ్డు పాలు కాకుండా చేసిన సీపీకి రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.
Admin
Aakanksha News