ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అనారోగ్య కారణాలతో విధి నిర్వహణ చేయలేని సింగరేణి ఉద్యోగుల కోసం సంస్థ నిర్వహించే మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, అక్రమాలకు తావు లేకుండా నిర్వహిస్తున్నామని, ఎవరైనా మోసగాళ్లు డబ్బు తీసుకొని అన్ ఫిట్ చేస్తామని ప్రలోభ పెడితే వాటిని నమ్మొద్దని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులందరినీ సింగరేణి సంస్థ నిర్వహించే మెడికల్ బోర్డులో నిపుణులైన వైద్యులు పరీక్షించి అన్ ఫిట్ చేయడం జరుగుతుందన్నారు. అన్ ఫిట్ అయిన వారి స్థానంలో కారుణ్య నియామకాలను వెంటనే చేపడుతున్నామని తెలిపారు.ఎవరైనా మోసగాళ్లు మాయమాటలు చెప్పి తాము అన్ ఫిట్ చేయిస్తామని చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని.. అలాంటి వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు.కార్మికులని వంచిస్తున్న ఇటువంటి మోసగాళ్ల సమాచారాన్ని విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి మోసగాళ్లపై నిఘా పెట్టాల్సిందిగా పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, ఇప్పటికే సుమారు 16 వేల మంది వారసులకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగిందన్నారు.
Admin
Aakanksha News