ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ నాయకుల మధ్య పోరు అంతర్గత విభేదాలతో రోడ్డు కెక్కింది. జిల్లా మంత్రులు, పార్టీ ఇంచార్జీలు దిగివచ్చిన వారి మధ్య సయోధ్య కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అందరిలోనూ రామగుండం గులాబీ రాజకీయంపై ఆసక్తి నెలకొంటుంది. నాటి నుండి నేటి వరకు నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు చీలికి చీలికి గాలి వానలా తయారై వర్గాలుగా విడిపోయే పరిస్థితికి వచ్చింది. రామగుండంలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంటుంది. రోజు రోజుకు జరుగుతున్న రాజకీయ పోరు వారి మధ్య విభేదాలను సృష్టించే విధంగా తయారవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరి వర్గం వైపు ఉండాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయ స్థితికి చేరడంతో రామగుండం గులాబీలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రతి ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచిస్తున్న దీనికి భిన్నంగా రామగుండం రాజకీయాలు కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలోనే నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని ఆశావాహులు బహిరంగంగా ప్రకటిస్తూ ఉండటంతో జోరుగా రాజకీయ చర్చ కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామగుండం నియోజకవర్గంలో ఆశావాహులు చేస్తున్న ఆశయ సాధన యాత్ర తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా ఆశావాహుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ నలుగురు ఆశావాహుల లిస్టులో మరో నాయకుడు చేరడంతో రామగుండంలో ఆశావాహుల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా, అసంతృప్తిగా ఉన్న నాయకులను ఆశావాహులు కలిసి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రామగుండం నియోజకవర్గంలో ఆశావాహులు నగర పాలక సంస్థ తొలి మాజీ మేయర్ కోంక్కటి లక్ష్మీనారాయణ, పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాతిపెళ్లి ఎల్లయ్యలు ఒకటిగా ఏర్పడి ఆశయ సాధన యాత్ర పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అసంతృప్తులను కలుపుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఎమ్మెల్యే పై అసంతృప్తిగా ఉన్న కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి నలుగురి ఆశావాహులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నలుగురితోపాటు తాను కూడా ఎమ్మెల్యే బరిలో పోటీలో ఉంటానని మా ఐదుగురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పోరాడి గెలిపించుకుంటామని తెలిపారు. అయితే తాము పార్టీకి వ్యతిరేకం కాదని, రామగుండం ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుతో పాటు కింది స్థాయి నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే బయటకు వచ్చి సొంతగా ప్రచారం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని వారు ఆరోపించారు. అంతే కాకుండా కొందరిని తన దగ్గర పెట్టుకొని వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతోపాటు రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంతో పాటు కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీల ఉద్యోగాలలో జరిగిన అవకతవకలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ప్రభావం చూపించనుందని కోరుకంటి చందర్ కు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఓడిపోయే పరిస్థితి వస్తాయని బయ్యపు మనోహర్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికైనా అధిష్టానం స్పందించాలని ఆయన తెలిపారు. ???? రామగుండం నియోజకవర్గం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా....? జిల్లా మంత్రులు, పార్టీ ఇంచార్జిలు నాయకుల మధ్య చేసిన సాయోద్య విఫలమైందా...? నాయకుల తీరుతో పార్టీపై ఇటువంటి ప్రభావం చూపనుంది...? వర్గపోరుపై అధిష్టానం ఎలా స్పందించనుంది...? నాయకుల మధ్య ఎటువంటి సయోధ్య కుదురుచునుంది...? ఎవరిపై వేటు వేయనుంది...? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో నడుస్తున్న గ్రూపు రాజకీయాలపై అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు పలువు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం వద్ద ఎవరి నాయకత్వం వారు నిరూపించుకోవడానికి నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు రాజకీయ చర్చకు దారి తీస్తుంటే ప్రజల్లో మాత్రం వ్యతిరేకతకు దారి తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయంపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నాయకుల మధ్య అధిష్టానం ఎటువంటి సయోధ్య కుదుర్చుతుందో వేచి చూడాల్సిందే....
Admin
Aakanksha News