Monday, 10 August 2026 02:46:36 PM

సింగరేణి రిటైర్డ్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యం.

క్వార్టర్ అప్పగింత సమయంలో జాప్యం...

Date : 24 January 2024 04:34 PM Views : 621

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో రిటైర్డ్ కార్మికులు సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపు కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని, క్వార్టర్ అప్పగింత సమయంలో అందులో షెడ్లు కట్టుకున్నారని ,ఇంకా ఏవేవో కొర్రీలు పెడుతూ వెకేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు ఆరోపించారు.బుధవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు ముప్పై , నలభై ఏళ్లు సేవ చేసి పదవి విరమణ పొందిన కార్మికులను, సీనియర్ సిటిజన్లను జిఎం కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం అన్యాయమని వారన్నారు. ఏనాడో కట్టిన డి-టైపు, టీ2 టైప్ క్వార్టర్లలో కుటుంబ అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో సౌకర్యమైన నిర్మాణాలు చేసుకుని, ఉన్నది ఉన్నట్లుగా కంపెనీకి అప్పగించి ఆబ్జెక్షన్ లేకుండా అవసరమైతే హామీ పత్రం రాసి ఇచ్చినప్పటికీని వెకేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆర్జీ-1 అధికారులు తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవంగా సర్వీస్ గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం నెల రోజుల్లోగా కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని చట్టం ఉన్నప్పటికినీ, అదేవిధంగా కోల్ ఇండియా సర్క్యులర్ 2019 జనవరి 16 ప్రకారం వెకేషన్ తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలనేది ఆదేశాలు ఉన్నప్పటికీనీ, యాజమాన్యం, అధికారులు ఇవేవి అమలు పరచకుండా రిటైర్డ్ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. న్యాయంగా రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ కార్మికులను నెలల తరబడి జి.ఎం.ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోవడం, సతాయించడం యాజమాన్యానికి , అధికారులకు మంచిది కాదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి త్వరితగతిన ఇలాంటి కేసులను సెటిల్ చేయాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని వారు పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికులను మనోవేదనకు గురి చేయకూడదని వారు యాజమాన్యంకు సూచించారు.అలాగే కార్మికుడు మెడికల్ ఇన్వాల్యుడేషన్ ఐన దగ్గరి నుండి డిపెండెంట్ కు ఉద్యోగం ఇచ్చే నాటికి చాలా సమయం పడుతున్నదని, ఈ జాప్యాన్ని కూడా నివారించాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ పేరున విచారణ నిమిత్తం ఆ తర్వాత డిపెండెంట్ యొక్క మెడికల్ ఫిట్ కోసం కూడా తీవ్రమైన ఆలస్యం అవుతున్నదని, డిపెండెంట్ లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సకాలంలో యాజమాన్యం కు, సంబంధించిన అధికారులకు సమర్పించినప్పటికిని విటిసి పంపడానికి దాదాపు ఆరేడు నెలల సమయం తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అలాగే మెడికల్ ఫిట్ అయినటువంటి డిపెండెంట్ లను వెంటనే విటిసికి పంపడం ట్రైనింగ్ పూర్తయిన వెంటనే పోస్టింగ్ ఇవ్వడం లాంటివి కూడా జరగాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 400 మంది వారసులు ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూస్తున్నారని, తక్షణమే వారిని విటిసి ట్రైనింగుకు పంపి అనంతరం వెంటనే పోస్టింగ్ ఇచ్చే లాగా తగిన చర్యలు తీసుకోవాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు , లేదంటే ఆందోళనలు తప్పవని వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు గండి ప్రసాద్, ఎం.ఏ.గౌస్, తాళ్ళపెల్లి మల్లయ్య, విక్రం, చెప్యాల మహేందర్ రావు, ఎర్రల రాజయ్య, గంగారపు చంద్రయ్య, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :