ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : “నేను చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోలేదు. ఆ చెట్టు నీడలో ఉన్నంత వరకు ఆ చెట్టును రక్షించడానికి, దాన్ని దుర్మార్గుల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా గురువు, నా తండ్రి, నా నాయకుడు అయిన కేసీఆర్ లేకుండా తెలంగాణ రావడం అసాధ్యం. ఆయన లాంటి ఉద్యమ నాయకుడు లేకుంటే ఈ రాష్ట్రం అసంభవం అని అన్నారు. అలాగే పార్టీ వ్యవహారాలపై, తన వ్యక్తిగత నిర్ణయాలపై స్పష్టత నిచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... నన్ను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసినా, తెలంగాణ కోసం నా ప్రయాణం ఆగదు. నేను తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని, జాగృతి సంస్థను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ జాగృతి అంటే కేవలం సంస్థ కాదు. తెలంగాణ స్ఫూర్తి, సాంస్కృతిక చైతన్యం ప్రతీక అని పేర్కొన్నారు.నేను జాగృతి కార్యక్రమాల్లో ఎప్పుడూ కేసీఆర్ ఫోటో పెట్టలేదు. ఆయన ఉద్యమ నాయకుడు అయినా సరే, జాగృతి ఒక సామాజిక సంస్థ, రాజకీయ వేదిక కాదు. నేను టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పుడు మాత్రమే ఆయన ఫోటో ఉపయోగించాను. కానీ ఇప్పుడు నైతికంగా అది సరైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు దారులు వేరయ్యాయని స్పష్టం చేశారు.కాని ఇప్పుడు నేను నా నైతిక విలువలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాను. కాబట్టి కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతి కార్యక్రమాలను కొనసాగించడం నైతికంగా సరైనదే అని వివరించారు.నేను తెలంగాణ కడుపున పుట్టాను అనేది నా అదృష్టం. కేసీఆర్ నా తండ్రి కావడం నా జీవితంలో గొప్ప వరం. కానీ దారులు వేరైనప్పుడు ఆయన పేరు చెప్పుకొని నా ప్రయాణం కొనసాగించడం నైతికంగా తగదు. అందుకే ఆయన ఫోటో లేకుండా ముందుకు వెళ్తున్నాను అని కవిత స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కవిత త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ జాగృతి యాత్ర”ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, యువతలో తెలంగాణ ఆత్మను మళ్లీ రగిలించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా “కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర” అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణ జాగృతి తిరిగి రాజకీయ చైతన్య వేదికగా మారుతుందా? లేక సామాజిక ఉద్యమ సంస్థగానే కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కవిత యాత్రను అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Admin
Aakanksha News