Sunday, 05 April 2026 05:11:01 AM

సీఐ ఇంద్రసేనారెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు... మా మామపై ఎటువంటి కారణం లేకుండా సీఐ బహిరంగంగా చెంపదెబ్బ కొట్టారు...

మాజీ కార్పొరేటర్ బొడ్డు రజితపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు..

Date : 18 February 2026 06:52 PM Views : 1701

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పోలీసు అధికారి అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి పై బాధితుడు బొడ్డు రవీందర్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున గోదావరిఖని విఠల్ నగర్ ప్రాంతంలోని తన నివాసానికి మధ్యాహ్నం సమయంలో సీఐ ఇంద్రసేన రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి వచ్చి, ఎటువంటి వారెంట్ లేకుండా అక్రమంగా ఆవరణలోకి ప్రవేశించారని రవీందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన గేటును లాఠీతో బలవంతంగా కొట్టి దెబ్బతీయడంతో పాటు, గేటుకు అమర్చిన షీట్ నష్టపోయిందని, ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్ ఇండికేటర్ కూడా విరిగిపోయిందని తెలిపారు.ఇంటి లోపలికి ప్రవేశించిన అనంతరం సీఐ తన భార్య, మాజీ కార్పొరేటర్ బొడ్డు రజితపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని, ఆమె ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ లాఠీతో బెదిరించి పోలింగ్ రోజున బయటకు రాకూడదని ఆదేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఇంట్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు.ఇంకా, సంఘటన సమయంలో ఇంట్లో ఉన్న తన మామపై ఎటువంటి కారణం లేకుండా సీఐ బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడని, తన భార్య ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించి దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఈ ఘటన ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునే విధంగా జరిగిందని రవీందర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సీఐ ఇంద్రసేన రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డీజీపీని బాధితుడు కోరారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :