ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కళేశ్వరం జోన్ పరిధిలో నీటిసాధన పథకాలతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులో ఉన్నా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావలసిన నీటిని అందించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణలో కేసీఆర్ హయాంలో రైతులకు అనుకూలంగా సాగునీటి వనరులు ఏర్పడాయి. అయితే ఇప్పుడు ఆ వనరులు ఉన్నా, రైతులకు నీరు అందకపోవడం ఎంతో విచారకరం. ఇది పాలనలో ఉన్న అసమర్థతకు నిదర్శనం,” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి బహుళ ప్రయోజనాలున్న సాగునీటి ప్రణాళికలు రైతులను భరోసాగా ఉంచాయి. కానీ ప్రస్తుతం వాటిని ఉపయోగించకుండా, నీటి ఎద్దడితో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిశాఖ మంత్రి వ్యవహారం పూర్తిగా అజ్ఞానం, అలసత్వంతో నిండి ఉంది,” అని మండిపడ్డారు.ఇటీవల ప్రభుత్వం నీటి విడుదలలో పాలనాపరమైన అలక్ష్యం స్పష్టంగా కనిపించిందని, ఇది రైతులపై కుట్రలా అనిపిస్తోందని ఆరోపించారు. “కమిషన్లు, కంపు మాటలు తప్ప రైతు ప్రయోజనాలపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు,” అని విమర్శించారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ పాలనను లక్ష్యంగా చేసుకున్నారు. “కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా వృద్ధి చెందింది. కానీ ఇప్పుడు ప్రతి రంగం సంక్షోభంలో ఉంది. అప్పులు పెరిగాయి, ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి,” అన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News