ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి బార్ అసోసియేషన్‌లో కోర్టు స్థల కేటాయింపు వివాదం తీవ్ర రాజకీయ రంగు పులుముకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్‌ను కార్యవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఆధారంగా సస్పెండ్ చేయడం పెద్దపల్లి న్యాయవర్గాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని, అసోసియేషన్ బైలా నిబంధనలకు విరుద్ధమని అధ్యక్షుడు భాస్కర్ తేల్చి చెప్పారు.గురువారం జిల్లా కోర్టు వద్ద సీనియర్ సభ్యులు దొంతి కిష్టయ్య, కోశాధికారి గౌరిశెట్టి సత్యనారాయణ, లైబ్రరీ సెక్రెటరీ పుట్ట రవితో కలిసి మీడియాతో భాస్కర్ మాట్లాడారు. కన్నాల వద్ద జిల్లా కోర్టు భవనం కోసం అనుకున్నారు గాని, పెద్దపల్లిలో స్థలం సరిపోక ప్రభుత్వమే రాఘవపూర్ ప్రాంతంలో 10 ఎకరాలు కేటాయించిందని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని 2023లోనే 114 మంది సభ్యుల సంతకాలతో ఆమోదించారని, ఇప్పుడు అదే అంశాన్ని అడ్డు పెట్టుకుని కొందరు సీనియర్ సభ్యులు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం రగులుస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివాదంతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరైన రూ.81 కోట్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వరుస విజయాలు, తాను బలహీన వర్గాలకు చెందిన వాడినన్న కారణాలతో కొంతమంది సభ్యులు రాజకీయంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం బైలా నిబంధనల్లో ఏ విధంగానూ లేనందున, మార్చి 31 వరకు తానే అధ‍్యక్షుడని స్పష్టం చేశారు. అక్రమ సస్పెన్షన్ నిర్ణయంపై హైకోర్టులో లీగల్ పోరాటం చేస్తానని, ఇప్పటికే బార్ కౌన్సిల్ మరియు జిల్లా జడ్జికి ఫిర్యాదులు సమర్పించినట్లు పేర్కొన్నారు. తరువాత సీనియర్ సభ్యులు దొంతి కిష్టయ్య, సత్యనారాయణ, పుట్ట రవి మాట్లాడుతూ కార్యవర్గం తీసుకున్న సస్పెన్షన్ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని ట్విట్టించారు. అడ్వకేట్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం కార్యవర్గానికి లేదని స్పష్టం చేశారు. రాఘవపూర్‌లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న కీలక నిర్ణయమని, ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న సభ్యులే అప్పట్లో సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.పెద్దపల్లి బార్ అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడిని ఇలా తొలగించడం తీవ్రమైన ఉదంతమని, ఇది పూర్తిగా లక్ష్య నిర్దేశిత చర్య అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి పదవీకాలం ముగిసేంతవరకు ఎవరికీ తొలగించే హక్కు లేదని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కొండ బత్తుల ఆంజనేయులు, ప్రసాద్ రావు, సొల్లురి మల్లేశం, డివిఎస్ మూర్తి, అమీర్ శెట్టి కృష్ణ, రాజు కార్తీక్, రాజేందర్, బండారి రమేష్, కుంభం సంతోష్, ప్రవీణ్ రావు, రఘువీర్, గడ్డి సదానందం, రాచూరి శ్రీకాంత్, వంశీకృష్ణ తదితరులు పాల్గొని అధ్యక్షుడు లకిడి భాస్కర్‌కు మద్దతు ప్రకటించారు.
Admin
Aakanksha News