Tuesday, 17 March 2026 05:11:11 PM

మంత్రి – ఎంపీకి దూరంగా ఎమ్మెల్యే వైఖరి..? కార్పొరేషన్ ఎన్నికల తర్వాత చర్చనీయాంశంగా మారిన పరిణామాలు...

ఉత్తర తెలంగాణలోని రాజకీయాల్లో వేడెక్కుతున్న సమీకరణాలు...

Date : 16 March 2026 06:57 AM Views : 319

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఓ నియోజకవర్గం ప్రస్తుతం మళ్లీ రాజకీయ చర్చల కేంద్రబిందువుగా మారింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గంలో వచ్చే ఫలితాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అక్కడి ప్రజల తీర్పు తరచూ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా రాజకీయ విశ్లేషకులకూ అనేక ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంటుంది.అందుకే ఆ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణ రాజకీయాలకు నిలువుటద్దంగా భావిస్తారు.ఆ నియోజకవర్గంలో ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది ఉన్నా చివరికి సానుభూతి అనే రాజకీయ ఆయుధం ఎవరికో ఒకరికే వరంగా మారుతుందనే విశ్లేషణలు తరచూ వినిపిస్తుంటాయి. అక్కడి ఓటర్లు ఎవరికైనా అయ్యో పాపం అనే భావనతో అండగా నిలిస్తే ఆ నేతకు గెలుపు దాదాపు ఖాయం అన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి సానుభూతి వాతావరణం ఒక నాయకుడికి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు నిలబడి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన ఆ నాయకుడు చివరికి ప్రజల ఆశీర్వాదంతో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ప్రారంభంలో ఆ నాయకుడి విజయం స్థానిక ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. గెలిచిన తర్వాత కొంతకాలం వరకు పరిస్థితులు సజావుగానే ఉన్నాయని కూడా పలువురు చెబుతున్నారు.అయితే కాలక్రమేణా ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. గెలిచేదాక ఓడ మల్లన్న గెలిచాక బోడ మల్లన్న అన్నట్లుగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అంతర్గత రాజకీయాలు అక్కడ కొత్త మలుపులు తిరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ప్రముఖ మంత్రితో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటి నుండి తమ కుటుంబం మొత్తం నమ్మిన పార్టీ జెండాను పట్టుకుని రాజకీయాల్లో ఎదిగిన ఆ మంత్రి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.అయితే అదే జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఈ విభేదాలు బహిర్గతమయ్యాయనే చర్చలు జరుగుతున్నాయి.ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రికి అనుచరులుగా భావించే నాయకులకు పార్టీ టికెట్లు ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పోటీ చేసిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతరులను ప్రోత్సహించడం జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసినట్లు సమాచారం.ఇక ఇదే జిల్లాకు చెందిన మరో కీలక రాజకీయ నాయకుడి విషయానికి వస్తే పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఒక దివంగత ప్రజానాయకుడి మనవడు ప్రస్తుతం ఆ జిల్లాకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పేదల పక్షపాతిగా, ప్రజల కోసం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆ దివంగత నేతకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.అలాంటి నాయకుడి కుటుంబానికి చెందిన యువ నాయకుడు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచారు. అయితే అదే జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో మాత్రం ఆ ఎంపీ ప్రభావం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రత్యేకించి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంపీ అనుచరులకు కూడా పార్టీ టికెట్లు దక్కలేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతరులను నిలబెట్టడం జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఈ పరిణామాల కారణంగా ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎటు దిశగా సాగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో కీలక మంత్రి, మరోవైపు అదే జిల్లాకు చెందిన ఎంపీ ఉండగా స్థానిక ఎమ్మెల్యే మాత్రం పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర స్థాయి నాయకులను పట్టించుకోకుండా తాను చెప్పిందే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఈ విమర్శలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో మంత్రి, ఎంపీకి సంబంధించిన అనుచరుల్లో ఒక్కరు కూడా గెలవక పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ పోటీనా లేక అంతర్గత విభేదాల ఫలితమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.ఆ నియోజక వర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మరింత ఆసక్తికరమైన రాజకీయ మార్పులకు వేదిక కావచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మారుతాయో, నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఎటు దారి తీస్తాయో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశముంది.మొత్తానికి ఉత్తర తెలంగాణలో రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తిని కలిగించే ఆ నియోజకవర్గం మళ్లీ ఒకసారి రాజకీయ చర్చల కేంద్రంగా మారింది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నెలకొన్నట్లు ప్రచారం జరుగుతున్న విభేదాలు రాబోయే రోజుల్లో మరింత రాజకీయ చర్చలకు దారి తీసే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :