Saturday, 26 September 2026 07:43:23 PM

భవిత శ్రీ చిట్స్ మోసం కేసులో ఎండీ తాటిపల్లి అరెస్టు...

Date : 18 November 2025 09:08 PM Views : 1196

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : భవిత శ్రీ చిట్స్ సంస్థ సభ్యులను భారీ స్థాయిలో మోసగించిన కేసులో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపెల్లి శ్రీనివాస్‌ను హన్మకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే చిట్ సంస్థ ఛైర్మన్ గుండా ప్రకాష్ రావును వరంగల్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజా అరెస్ట్‌తో బాధితుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో భవిత శ్రీ చిట్స్ బ్రాంచ్ ఏర్పాటు చేసి, నెలసరి చెల్లింపుల పేరుతో చిట్ సభ్యుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులను వసూలు చేసిన సంస్థ, చిట్ కాలపరిమితి పూర్తయ్యాక సభ్యులకు తిరుగు చెల్లింపులు చేయలేదన్న ఆరోపణలు వెలువడ్డాయి. చెల్లింపులు కోరిన సభ్యుల ఆందోళనలు పెరుగుతుండగా, అకస్మాత్తుగా ఆ బ్రాంచ్ కార్యాలయాన్ని ఎత్తేయడంతో బాధితులు హన్మకొండలోని ప్రధాన కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఎలాంటి స్పందన లభించకపోవడంతో బాధితుల నిరాశ తారాస్థాయికి చేరింది. ఎవరైనా బాధితులు డబ్బులు అడిగిన సభ్యులపై భవిత శ్రీ యాజమాన్యం ఎదురు దాడులకు దిగిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూ, వేగంగా బ్రాంచ్ కార్యాలయాలను పెంచుకుంటూ పోయిన ఈ సంస్థ, ప్రజలను ఆకర్షించేందుకు ఉద్యోగుల ద్వారా మాయమాటలు చెప్పించి చిట్ సభ్యులను చేర్పించిందని బాధితులు చెబుతున్నారు. కానీ చెల్లింపుల దశకు వచ్చేసరికి సంస్థ అకస్మాత్తుగా గల్లంతవడంతో సభ్యులు ఆగమ్యగోచర పరిస్థితిలో నిలిచారు.రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు, రికవరీ యాక్ట్ నిబంధనలు పాటించకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు సేకరించినట్టు స్పష్టమవుతోంది. చిట్ సభ్యుల డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. సంస్థ ప్రతినిధులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులను స్వాధీనం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు, సంస్థ ప్లాట్ల పేరుతో కూడా సభ్యులను మోసగించిన అవకాశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భవిత శ్రీ ఛైర్మన్, ఎండీల అరెస్టుతో కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. నిజానికి ఎంతమంది సభ్యులు మోసపోయారో, ఎంత మొత్తం డబ్బు దారి మళ్లించబడిందో, సంస్థ ఆస్తులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితులు తమ కష్టార్జిత డబ్బులు తిరిగి లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. భవిత శ్రీ చిట్స్ మోసం కేసు ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా జరగాలని, సంస్థ ఆర్థిక అక్రమాలన్నీ బహిర్గతం కావాలని సభ్యులు కోరుకుంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :