ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రాబోయే ఎన్నికలకు రామగుండం నియోజక వర్గంలో ఇప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బహిర్గతమవుతున్నాయి. నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కార్యకర్తలు, ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.ఇటీవల ఒక వర్గ నాయకుడి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. “ఆలు లేదు సులు లేదు, కొడుకు పేరు సోమలింగం” అన్నట్టు ఏ ఆధారం లేకుండా ఇప్పటికే తాను గెలిచినట్లుగా ప్రవర్తిస్తున్నారని నియోజకవర్గంలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ కాలం గడపకపోయినా, రెండు మూడు రోజులు వచ్చినప్పుడల్లా హడావుడి చేస్తూ, తన అనుచరులతో కలసి హడావిడి చేసి మళ్లీ తిరిగి పట్నం వెళ్లిపోతారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకే టికెట్ వస్తుందో. లేక మరెవరికైనా వస్తుందో దేవుడికే తెలుసు. అయినప్పటికీ ముందే విజేతలా వ్యవహరించడం పార్టీకి మైనస్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, సొంత మాజీ నేతలపైనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల గ్రూపు విభేదాలు మరింత పెరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది.పార్టీ పటిష్టతకు బదులు ఒకరినొకరు బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, వర్గపోరు కారణంగా కొంతమంది కార్యకర్తలు ఇతర పార్టీలకు దగ్గరవుతున్నారని కూడా సమాచారం. బీఆర్ఎస్ లోనూ కొందరి ప్రవర్తనపై అసంతృప్తి పెరుగుతుండటంతో స్థానిక స్థాయిలో బలహీనత స్పష్టమవుతోంది. పార్టీ సిద్ధాంతాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నడుస్తున్న ఈ తరహా గ్రూపు రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేక గాలులు విస్తాయన్న ఆందోళన గట్టిగా వినిపిస్తోంది.ఇది బీఆర్ఎస్ కు తగిన తీరు కాదు. ఎన్నికల ముందు గ్రూపు రాజకీయాలు చేయడం పార్టీకి ప్రమాదకరం అని పార్టీ నాయకులు ఎవరైనా సిద్ధాంతం కోసం పని చేయాలని పలువురు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రామగుండం నియోజక వర్గంలో బీఆర్ఎస్ అంతర్గత పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయో, పార్టీ అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Admin
Aakanksha News