ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర రాజకీయ గందరగోళం నెలకొంది. మాజీ ఆర్జీ–1 జీఎం కల్వల నారాయణ వంతనాలు జరుపుతూ మేయర్ పదవిపై ఆసక్తి చూపుతుండటంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఒక వైపు మాజీ జీఎం మేయర్ బరిలో నిలవడానికి ప్రయత్నిస్తుండగా, మరో వైపు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు పోటీకి సిద్ధమవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.రామగుండం పట్టణ రాజకీయాల్లో కార్మిక సంఘాలకు ఎప్పటి నుంచో కీలక పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై కార్మిక సంఘాల నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల వలస నాయకత్వాన్ని తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. సొంత పార్టీ నేతలకు అవకాశాలు ఇవ్వకుండా బయటి నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావన బలపడుతోంది.మాజీ ఆర్జీ–1 జీఎం మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తుండటం కొంతమంది నేతలకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన స్థానిక నాయకులను పక్కనపెట్టి,కొత్త సమీకరణలు తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో కార్మిక సంఘం నాయకుడు కూడా మేయర్ బరిలోకి దిగుతుండటంతో పోటీ త్రిముఖంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.టీబీజీకేఎస్‌కు చెందిన మరో కార్మిక సంఘం నాయకులు కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సదురు కార్మిక సంఘం నాయకుడికి మద్దతుగా కార్మిక సంఘం నేతలు బహిరంగంగా నిలవడంతో పార్టీలో వర్గాల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఈ పరిణామాలతో మేయర్ పీఠం కోసం ఆశలు పెట్టుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రామగుండం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న ఈ అయోమయ పరిస్థితి స్థానిక రాజకీయాలను వేడెక్కిస్తోంది. పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత చేదుగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో సమన్వయం లేకపోవడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ఒకవైపు, కార్మిక సంఘాల బలం మరోవైపు ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య రామగుండం మేయర్ పీఠం కోసం సాగుతున్న పోరు రానున్న రోజుల్లో మరింత ఉత్కంఠభరితంగా మారనుందని పట్టణంలో చర్చ సాగుతోంది.
Admin
Aakanksha News