ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వాక్యాలు రాజకీయాల్లో మరో దుమారాన్ని కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్ గా కవిత చేసిన వాక్యాలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. హరీష్ రావును గుంటనక్క తోక కుక్కను ఊపినట్టే’ అనడం రాజకీయాల్లో ప్రకంపనలకు దారితీస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీటి వాటాపై ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఆదివారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఘాటైన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిరంగంగా బయటపెట్టినట్లయ్యాయి. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.వ్యక్తిగతంగా హరీష్ రావుపై ఒక్క మాట అంటేనే సభను బైకాట్ చేస్తారా..? అని ప్రశ్నించిన కవిత, ఆ అంశంపై వాకౌట్ చేస్తే ఆ తర్వాత మళ్లీ సభకు రావొచ్చు కదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షం ఉండకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.సభ నుంచి వాకౌట్ చేయాలన్న నిర్ణయం పూర్తిగా హరీష్ రావుదేనా? లేక పార్టీ నిర్ణయమా? అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్‌లో నిర్ణయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయనే అంశాన్ని కవిత తెరపైకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు తనకంటూ ప్రత్యేక గుంపును తయారు చేస్తున్నారని ఆరోపించిన కవిత, ఇది పార్టీకి దీర్ఘకాలంలో నష్టాన్ని తెస్తుందన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే చట్టసభల్లో మాట్లాడటమే ప్రజలకు మేలు చేస్తుందని, ఆ అవకాశాన్ని వదులుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వ్యూహాలపై ప్రశ్నార్థకంగా మారాయి.హరీష్ రావు వ్యవహారాన్ని ‘గుంటనక్క తోక కుక్కను ఊపినట్టుగా’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నాయి. కృష్ణా నీటి పంపకాల విషయంలో తెలంగాణ హక్కులు తగ్గించే విధంగా హరీష్ రావు ఎందుకు సంతకం చేశారో వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.ఇది కేవలం విమర్శ మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడంలో ధనదాహమే కారణమని కవిత చేసిన ఆరోపణలు, సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వ నిర్ణయాలపై మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. హరీష్ రావు నిర్ణయాల వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లోని మరో వర్గానికి అసహనం కలిగిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిపైనా కవిత తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడన్న అంశానికే పరిమితం అవుతూ, కృష్ణా నది నీటి వాటాపై సమగ్ర చర్చ జరపడం లేదని విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంచడంపై ఉత్తరం రాసి వదిలేయడమే తప్ప, చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదన్నారు.కృష్ణా నీటిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదని ప్రశ్నించిన కవిత, తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో వివాదాలు ఉన్నా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పుడు సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్రకు ఇచ్చిన జాతీయ హోదాను తొలగించాలని ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు పాత్రపై పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై నీటి వివాదాల అంశంలో రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట నుంచి మొదలైన ఈ వ్యాఖ్యల దుమారం, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Admin
Aakanksha News