ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : సొంత పోలీస్ శాఖలోనే కిందిస్థాయి సిబ్బంది పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. ప్రత్యేక విభాగానికి చెందిన ఒక హోంగార్డు తన ద్విచక్ర వాహనాన్ని ప్రతిరోజూ విధి నిర్వహణకు ముందు ఒక పోలీస్ స్టేషన్‌లో నిలిపి, అక్కడి నుంచి పెద్దపల్లికి వెళ్లి విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఘటనలో అదే శాఖలో పనిచేస్తున్న ఒక ఎస్.ఐ ఆ హోంగార్డు వాహనంపై దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.స్థానికుల వివరాల ప్రకారం, హోంగార్డు ప్రతి రోజులాగే తన వాహనాన్ని స్టేషన్ ప్రాంగణంలో నిలిపి విధులకు వెళ్లాడు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్.ఐ, ఆ వాహనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుగా టైర్లలో గాలి తీసి, తర్వాత తన కారుతో గుద్ది, లాఠీతో కొట్టి వాహనంలోని డూమ్‌లను పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోంగార్డు తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.సొంత పోలీస్ శాఖలోనే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది పట్ల ఇలాంటి ప్రవర్తన ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ ప్రజా ఆస్తి కాగా, ఒక అధికారి వ్యక్తిగత ఆస్తిలా భావించి ఇలా వ్యవహరించడం సరైందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరికి చెందినదో, అందులో వాహనాలు నిలిపే హక్కు ఎవరికో అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది.ఈ ఘటనపై హోంగార్డు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది గౌరవం, భద్రత కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై సంబంధిత పోలీస్ అధికారులు స్పందించాల్సి ఉంది. హోంగార్డు వాహనాన్ని ధ్వంసం చేసిన ఎస్.ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా, లేక ఘటనను నిర్లక్ష్యం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారి, పోలీస్ శాఖలో అంతర్గత వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Admin
Aakanksha News