Monday, 23 February 2026 03:40:19 AM

సీఐ ఇంద్రసేనా రెడ్డి, గన్ మెన్ ప్రవీణ్ పై డీజీపీకి ఫిర్యాదు....

ఘటనపై న్యాయవాదుల వర్గాల్లో ఆగ్రహం, దర్యాప్తు కోసం డిమాండ్...

Date : 22 February 2026 10:50 AM Views : 293

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో న్యాయవాదిపై పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మరియు అతని గన్‌మెన్ దాడి చేసారనే ఘటన గత 8ఎనిమిది రోజులుగా వివాదాలకు నీలయంగా మారుతుంది. గోదావరిఖని పట్టణానికి చెందిన న్యాయవాది మార్కపురి తిలక్ ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం సమయంలో గోదావరిఖని లాల్ బహదూర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నారు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం, కోర్టు పనులు ముగించుకొని తన ఇంటికి వెళ్తున్న సమయంలో లాల్ బహదూర్ నగర్‌లోని సిపిఐ జెండా స్థంభం వద్దకు చేరుకునేలోగా గోదావరిఖని-I పట్టణ సీఐ ఇంద్రసేన రెడ్డి తన గన్‌మెన్‌తో అక్కడికి చేరుకుని తనను ఆపినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న రూ.47,500 మొత్తాన్ని వివాహ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ముందు పార్టీలకు అప్పగించాల్సిన డబ్బుగా వివరించినప్పటికీ, పోలీసు అధికారి తన వివరణను వినకుండా వ్యవహరించారని ఆరోపించారు.తన సోదరుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు ఉంచుకున్నానని అనుమానం ఉంటే, చట్ట పరమైన ప్రక్రియ ప్రకారం ఇద్దరు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకోవచ్చని, అవసరమైతే తనపై కేసు నమోదు చేయవచ్చని తిలక్ తెలిపారు. కానీ అలాంటి చట్టబద్ధమైన విధానాన్ని పాటించకుండా సీఐ తన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకుని కాల్ లాగ్‌లోని వ్యక్తులకు స్వయంగా కాల్ చేసి “రండి ఇక్కడ డబ్బులు పంచుతున్నాం” అంటూ తప్పుడు ప్రచారం చేయడం ద్వారా తనపై అపవాదు మోపారని ఆరోపించారు.ఇది మాత్రమే కాకుండా అక్కడే ఉన్న గన్‌మెన్ తనపై దాడి చేసి నుదిటిపై గాయాలు చేశాడని బాధితుడు పేర్కొన్నారు. ఈ సంఘటనను అక్కడున్న ప్రజలు కూడా గమనించారని తెలిపారు. అనంతరం తనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి ఎన్నికల అధికారుల సమక్షంలో పంచనామా తయారు చేసినట్లు తెలిపారు. అయితే జరిగిన వాస్తవాలను పంచనామాలో నమోదు చేయాలని తాను మరియు అక్కడకు చేరుకున్న న్యాయ వాదులు కోరినప్పటికీ తమ వాదనలను పట్టించుకోలేదని చెప్పారు.తనపై కేసు నమోదు చేసినా తాను కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ పోలీసు అధికారి మరియు గన్‌మెన్ ప్రవర్తన పూర్తిగా అన్యాయం, చట్ట వ్యతిరేకమని తిలక్ అన్నారు. గోదావరిఖని-I పట్టణ పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి 12:30 గంటలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని, రసీదు కూడా ఇవ్వలేదని వాపోయారు.ఈ నేపథ్యంలో సంబంధిత సీఐ మరియు గన్‌మెన్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం శిక్షించాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తిలక్ వెల్లడించారు. ఈ ఘటనపై న్యాయ వాదుల వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి దర్యాప్తు చేపడతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే గోదావరిఖని 1టౌన్ సీఐ ఇంద్ర సేనా రెడ్డిపై రాష్ట్ర డిజిపీకి ఈ ఒక్క నెలలోనే రెండు పిర్యాదులు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :