ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పెరుగుతున్న వేళ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్‌లో జనసేన పార్టీ అభ్యర్థి బొక్కేనపల్లి వాసవి మూర్తి చేపడుతున్న ప్రచారం ప్రజల మనసులను ఆకట్టుకుంటోంది. డివిజన్ ఆడబిడ్డగా అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ఇచ్చిన హామీకి మహిళలు,యువత, పెద్దలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. గోదావరిఖని శివాజీ నగర్‌లో ఇంటింటి ప్రచారంలో ప్రజల స్పందన జనసేనకు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా చూపిస్తోంది. మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల పాలనకు మానవీయ స్పర్శ పెరుగుతుందనే అభిప్రాయం బలపడుతోంది. కుటుంబాలు ఎదుర్కొనే రోజువారీ సమస్యలు, మహిళలు–పిల్లల భద్రత, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలను ప్రత్యక్షంగా తెలిసిన మహిళా నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థంగా పని చేస్తుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోంది. విద్య మహిళ సాధికారికకు పునాదని, చిన్న తరహా పరిశ్రమలు మహిళలను ఆర్థికంగా నిలబెట్టే మార్గమని వాసవి మూర్తి స్పష్టంగా పేర్కొంటున్నారు.ఉన్నత చదువులు చదివిన మహిళగా డివిజన్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆమె ప్రకటిస్తున్నారు. మహిళలు రాజకీయాల్లో రాణిస్తే పాలనలో పారదర్శకత పెరుగుతుందని,సామాజిక న్యాయం బలపడుతుందని ఆమె ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ అభిమానులు, డివిజన్ ప్రజల్లో ఉన్న మంచి పేరు ఆమెకు అనుకూలంగా మారుతోంది. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా సేవాభావంతో ముందుకు సాగుతానన్న ఆమె మాటలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. దీంతో ప్రచారం మరింత వేగం పుంజుకుని, డివిజన్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మహిళల హక్కులు రక్షితమవ్వాలంటే నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం అవసరమనే భావన ఈ ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తోంది. మన ఇంటి మనిషిగా, మన ఇంటి మహిళగా గెలిపించుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతుండటం మహిళా రాజకీయానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. జనంతో మమేకమవుతున్న ఈ ప్రచారం, మహిళా నాయకత్వానికి బలమైన బాటగా నిలుస్తోంది.
Admin
Aakanksha News