ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి గ్రామంలో గ్రామస్థాయిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని విద్యారంగానికి మద్దతుగా నిలిచిన ప్రజలు ప్రైవేట్ పాఠశాలల వ్యాన్లు, బస్సులను అడ్డుకుంటూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామస్థులు ఆంజనేయస్వామి ఆలయం వద్దే అడ్డుకున్నారు. వ్యాన్లు, బస్సుల్లో ఎక్కిన విద్యార్థులను దింపివేశారు. ఈ దృశ్యం చుట్టుపక్కల గ్రామాల్లో సైతం చర్చనీయాంశమైంది. గ్రామంలో ఉన్న ఉషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్ధులందరిని చేర్చాలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
విశ్వాసం, గౌరవానికి నిదర్శనంగా ప్రభుత్వ పాఠశాల...
ఈ విషయమై సమాచారం అందుకున్న శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. "మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను వదలకండి. ఊషన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులు కృషి వల్ల ఈ పాఠశాల ‘బెస్ట్ స్కూల్’ మరియు ‘ఛాంపియన్ స్కూల్’ అవార్డులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకుంది," అని గుర్తు చేశారు. అయితే చట్టపరమైన హెచ్చరికల పరిశీలనలో భాగంగా, సమీపంలోని పెగడపల్లి, శ్రీరాంపూర్ గ్రామాల నుండి వచ్చిన ప్రైవేట్ స్కూళ్ల వాహనాలను తనిఖీ చేసిన ఎంఈఓ, వాటికి సరైన అనుమతులేదన్న విషయం వెలుగులోకి తెచ్చారు. ‘‘పర్మిషన్ లేకుండా పిల్లల్ని తరలించడం అనేది సరికాదు. ఇలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తక్షణమే వ్యవస్థను సమర్ధవంతంగా నడిపించండి లేకపోతే సంబంధిత పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తాం,’’ అని హెచ్చరించారు.
ప్రజల మద్దతుతో పాఠశాల దిశగా మారుతున్న ధోరణి....
ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, స్థానిక యువత, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించాలన్న నూతన శ్రద్ధ గ్రామంలో విద్యపై అవగాహన పెరిగిందనడానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాక జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల అభిమానం, నమ్మకం పెరుగుతుందన్న సంకేతాన్ని ఇస్తోంది. విద్యలో సమాన అవకాశాలను అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి ఊషన్నపల్లి గ్రామస్తుల ఈ చర్య ప్రేరణగా నిలుస్తోంది.
Admin
Aakanksha News