Tuesday, 11 August 2026 06:53:24 PM

ధర్మానికి-అవినీతికి మద్య జరుగుతున్న ఎన్నికలు.. మూడు స్థానాలను కైవసం చేసుకుంటాం...

కేంద్ర హోంశాఖా సహాయమంత్రి బండి సంజయ్..

Date : 21 February 2025 02:07 PM Views : 485

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలోకి తెలంగాణాలోని కాంగ్రెస్ సర్కారు దిగజారిందని బిజెపి కేంద్ర హోంశాఖా సహాయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లిలో తలపెట్టిన పచ్చీస్ ప్రభారి సమావేశంలో పాల్గొన్న ఆయన రంగంపల్లి వద్ద గల ఎంకెఆర్ బంకెట్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంపై విమర్శలు గుప్పించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా భూముల క్రమబద్ధీకరణ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. దీంతో తెలంగాణా ప్రజలపై రూ.50వేల కోట్ల భారం పడనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణా రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్, అందుకోసం రూ.లక్ష 8వేల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కల చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. కేంద్రంపై విమర్శలు మాని, ఇచ్చిన నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేసారో లెక్కలు చెప్పాలని నిలదీశారు. అబద్దాలకు, అవినీతికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని ఆ పార్టీని బొందపెట్టడానికి మేధావులు, పట్టాభధ్రులు సిద్దంగా ఉన్నరని పేర్కొన్నారు.

ఉద్యోగుల కోసం లాఠీదెబ్బలు..

పదవి విరమణ పొందిన వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడానికి, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి, ఫీజు రీ ఎంబర్సుమెంటు మంజూరు చేయడానికి కాంగ్రెస్ నేతలు 15శాతం కమీషన్లు గుంజుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగుల కోసం ఉద్యమించింది, లాఠీదెబ్బలు తిన్నది, కేసులపాలై జైళ్ళకు వెళ్ళింది బిజెపి కార్యకర్తలేనని, వారి త్యాగాలను గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

ముస్లింలను బిసి జాబితా నుండి..

20వేల నోటిఫికేషన్లు ఇచ్చి 50వేల ఉద్యోగులు కల్పించినట్లు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేస్తున్నదని బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లీములను బిసిల్లో చేర్చి హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్టంలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, కాశిపేట లింగయ్య, గోమాస శ్రీనివాస్, సునిల్ రెడ్డి, కందుల సంధ్యారాణి, శిలారపు పర్వతాలు, కోమల్ల మహేష్, బెజ్జంకి దిలిప్ కుమార్, అమరగాని ప్రదీప్, శివంగారి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :