ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం కార్పొరేషన్‌లో ఈ నెల 11వ తేదీ బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ 57వ డివిజన్‌లో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగియగా, అదే సమయంలో 57వ డివిజన్‌లో అనూహ్యమైన, చిత్ర విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గుండు రాజు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గకుండా ఇంటింటా తిరుగుతూ, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగించడంతో స్థానికంగా ఆయనకు గట్టి ఆదరణ లభించిందనే చర్చ వినిపించింది. ప్రచారం ముగిసే సమయానికి స్వతంత్ర అభ్యర్థి గెలుపు దిశగా దూసుకు పోతున్నాడనే అభిప్రాయాలు కూడా డివిజన్ అంతటా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో కుర్చీ గుర్తుతో పోటీ చేస్తున్న గుండు రాజు నివాసం ముందు పసుపు, నిమ్మకాయలతో కూడిన అనుమానాస్పద మంత్ర ప్రయోగం జరిగినట్లు గుర్తించారు. ఇంటి ముందు అమర్చిన ఈ వస్తువులు చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని, ఇది పూర్తిగా చిత్ర విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.స్వతంత్ర అభ్యర్థి బలమైన ప్రచారంతో ముందంజలో ఉండటాన్ని తట్టుకోలేక ప్రత్యర్థులు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారా, ఓటమి భయంతోనే ఇలాంటి మంత్ర ప్రయోగాలకు దిగారా, లేక వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ఈర్ష్యా, రాజకీయ కక్షల ఫలితంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఎన్నికల సమయంలో ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయాలనే ప్రయత్నంగా భావిస్తున్నారు.ఏది ఏమైనా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల సమయంలో ఇలాంటి అనుమానాస్పద చర్యలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళనకు, ఆశ్చర్యానికి దారి తీస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఈ సంఘటన మాత్రం 57వ డివిజన్ రాజకీయ చరిత్రలో ఒక విచిత్ర సంఘటనగా నిలిచిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Admin
Aakanksha News