ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : విద్యార్థుల భవిష్యత్తు కోసం నిత్యం కృషి చేయాల్సిన విద్యాసంస్థలు, వారినే ప్రమాదంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ ప్రాంతంలోని RFCL లో ఉన్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.ఆర్‌ఎఫ్‌సీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల రవాణా నిర్వహించిన ఈ పాఠశాల బస్సును మంగళవారం ఉదయం గోదావరిఖని ఆర్టీఏ అధికారులు నిలిపివేసి సీజ్ చేశారు. బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం, డ్రైవర్‌కు సరైన అనుభవం లేకపోవడం, బస్సు పత్రాల్లో చెల్లింపులు గడువు మించిపోయినట్లు అధికారులు గుర్తించినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనంతరం బస్సును సీజ్ చేశారు.
గతంలోనూ వివాదాలు....
శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల పేరు గతంలోనూ అనేక వివాదాల్లో నిలిచింది. అనుమతుల్లేని పుస్తక విక్రయాలు, అధిక ఫీజుల వసూలు, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు అందించకపోవడం, విద్యార్థులపై ఒత్తిడి పెడుతూ మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు పలుమార్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితోపాటు విద్యార్థులను చితకబాదిన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఇదేమిటని ప్రశ్నించిన తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు గతంలోనూ చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే పాఠశాలలో పనిచేసిన కొంతమంది పై కులం పేరుతో దూషించిన కేసులు సైతం నమోదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో పనిచేస్తున్న కొంతమందిని చితకబాదిన సంఘటనలు ఉన్నాయి.
తల్లిదండ్రుల ఆగ్రహం....
బస్సు సీజ్ వార్త వెలువడిన వెంటనే పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి నెల వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటివి చేయడమేంటి? పిల్లల ప్రాణాలను సరాసరి ప్రమాదంలోకి నెట్టడమే’’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు విద్యాశాఖకు, ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ‘కార్పొరేట్ విద్యా సంస్థల ధోరణి వల్ల పిల్లలు చదువు పేరుతో కష్టాల పాలవుతున్నారు. నిబంధనలకు లోబడి నడవలేకపోతే ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలలను ఎన్నుకుంటున్నా, వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి. గోదావరిఖనిలోని RFCL శ్రీ చైతన్య పాఠశాల ఘటన ఈ తరహా భయాన్ని మరింత పెంచింది. సంబంధిత శాఖలు వెంటనే జోక్యం చేసుకుని నిర్లక్ష్య పాలకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.
Admin
Aakanksha News