ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం పట్టణంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని, ఈ దౌర్జన్య పాలనకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. అక్రమంగా కూల్చివేతలకు పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితులను బెదిరింపులకు గురి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.రామగుండంలో కూల్చివేతల సందర్భంగా బాధితులను భయపెట్టి, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సంధ్యారాణి పేర్కొన్నారు. అసలు ఎవరి ఆదేశాలతో బాధితులకు ఫోన్‌లో మాట్లాడించారో, ఆ ఫోన్‌లో మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి ఎవరో, కూల్చివేయమని చెప్పిన నాయకుడికి ఎవరు అధికారం ఇచ్చారో కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బహిరంగంగా వెల్లడించాలని ఆమె సవాల్ విసిరారు. అధికార దుర్వినియోగంతో ప్రజల ఆస్తులను నాశనం చేస్తూ, ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆమె ఆరోపించారు. రామగుండంలో చేతకాని పాలన కొనసాగుతోందని, కూల్చివేతల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రౌడీయిజానికి పాల్పడుతున్నారని సంధ్యారాణి మండిపడ్డారు.నిబంధనలు, చట్టాలు పక్కనపెట్టి రాజకీయ అహంకారంతో కూల్చివేతలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. బాధితులకు ముందస్తు నోటీసులు,ప్రత్యామ్నాయాలు లేకుండా కూల్చివేతలు చేయడం అమానుషమని అన్నారు. అక్రమంగా కూల్చివేతలకు గురైన సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీజేపీ పార్టీ తరఫున పూర్తిస్థాయి అండగా నిలుస్తామని, న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతామని ఆమె హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం బిజెపి పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల పరిణామాలను ప్రజలు గమనించాలని, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా చైతన్యవంతం కావాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు. అక్రమ విధానాలను అడ్డుకుని చట్టబద్ధ పాలనను నిలబెట్టేందుకు ప్రజలు ఒక్కటై నిలవాలని ఆమె కోరారు. ప్రజల ఆస్తులు, జీవనాధారాలను కాపాడే వరకూ బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News