Wednesday, 18 February 2026 03:40:16 AM

నాలుగు రోజులు అక్కడ...నాలుగు రోజులు ఇక్కడ ఇంతకీ ఆయన ఉండేది ఎక్కడ...?

మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలోను పార్టీ అభ్యర్థుల ప్రచారానికి దూరం... నియోజకవర్గ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఖరి హాట్ టాపిక్...

Date : 17 February 2026 01:01 PM Views : 251

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఉత్తర తెలంగాణలోని ఒక ప్రముఖ నియోజక వర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు కనిపించగా ప్రతిపక్ష పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రముఖ ప్రతిపక్ష నేత వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజులు ఇక్కడ... నాలుగు రోజులు అక్కడ... చివరకు ఆయన ఉండేది ఎక్కడ?” అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేతో కలిసి మాజీ మంత్రి ఒంటరి పోరాటం చేసిన కొంత వరకు పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో సఫలీకృతమైయ్యారు. కానీ ప్రచారం కీలక దశలోకి చేరుకున్న వేళ కూడా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిన ఆ నేత కనిపించకపోవడం స్థానికంగా చర్చకు దారి తీసింది. పార్టీ అభ్యర్థులు స్వయంగా ఇంటింటి ప్రచారం చేస్తుండగా, తమకు మద్దతు ఇవ్వాల్సిన నాయకుడు మాత్రం అరుదుగా మాత్రమే ఆ నియోజక వర్గంలో కనిపించడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.ఎన్నికల ప్రచారం సమయంలో కీలక నేత దూరంగా ఉండటం కొంత మంది పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. కార్యక్రమాలకు మాత్రమే హాజరై, మిగతా సమయంలో కనిపించకుండా ఉండటం ఆ నేతకు అలవాటుగా మారిందనే ప్రచారం కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఉన్న నాలుగు రోజులు హడావుడిగా పర్యటనలు, సమావేశాలు నిర్వహించిన తర్వాత వెంటనే రాజధానికి వెళ్లిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రాకపోకలతో స్థానిక నియోజకవర్గ సమస్యలపై ప్రజల్లో నిరాశే పెరుగుతోంది.మరోవైపు, ప్రతిపక్ష పార్టీ అంతర్గతంగా మూడు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే పార్టీలో ఉంటూనే ఒకరికొకరు సంబంధం లేకుండా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తలను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఒక గ్రూప్ నిర్వహించిన కార్యక్రమానికి మరొక గ్రూప్ హాజరు కాకపోవడం, వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.స్థానికంగా పార్టీ శక్తిని పెంచాల్సిన సమయంలో అంతర్గత కలహాలు బహిర్గతం కావడం, నాయకత్వం సరిగా లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఇప్పటికే బలమైన స్థితిలో ఉండగా, ప్రతిపక్షం ఈ విధంగా విభజనకు గురవడం వారికి మరింత అనుకూల పరిస్థితిని కల్పిస్తోంది.ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలో స్థిరంగా ఉండకపోవడం స్థానిక ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తోంది.అయితే నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై గళమెత్తాల్సిన నేత మాత్రం అప్పుడప్పుడు మాత్రమే కనిపించడం ప్రజలలో నమ్మకం తగ్గించేలా మారింది. ప్రతిపక్షం అంతర్గత విభేదాలు బయట పడటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక నాయకత్వం ఒకే దారిలో నడవకపోతే భవిష్యత్తులో మరింత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక నియోజకవర్గ ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న మారుమోగుతోంది ఎన్నికల సమయంలో కూడా ప్రజల మధ్య ఉండని నాయకుడు, తర్వాత ఎక్కడ కనిపిస్తాడు?” అనే సందేహం. ఈ పరిస్థితుల్లో ఆ నేత తన వైఖరిని మార్చుకుని నియోజకవర్గంలో స్థిరంగా ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెడతారా? లేక ఇదే తీరు కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మొత్తానికి ఉత్తర తెలంగాణలోని ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత వ్యవహారం, పార్టీలోని విభేదాలు, ఎన్నికల వేళ నాయకత్వ లోపం అన్ని కలిపి అక్కడి రాజకీయాలను హాట్ టాపిక్‌గా మార్చేశాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :