ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహార శైలి మరోసారి వివాదాలకు దారితీసింది. తాజాగా న్యాయవాది మార్కాపూరి తిలక్‌పై దాడి జరిగిన ఘటనపై ఖని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదవడంతో, గతంలో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలను న్యాయవాదులు, ప్రజాసంఘాలు మరోసారి ప్రస్తావిస్తున్నాయి.ఈ ఘటనకు సంబంధించి బాధిత న్యాయవాది మార్కాపూరి తిలక్ ఖని రెండవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా, న్యాయమూర్తి వాదనలు విని కేసును బుధవారానికి వాయిదా వేశారు.ఈ నెల 10న ఎల్బీనగర్ ప్రాంతంలో కోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో న్యాయవాది మార్కాపూరి తిలక్‌ను అడ్డగించి పోలీసులు తన జేబు తనిఖీ చేసినట్లు, తన వద్ద కేసుకు సంబంధించిన రూ.47,500 నగదును లాక్కున్నారని బాధితుడు కోర్టుకు తెలిపాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తనపై దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాకుండా, సీఐ గన్‌మెన్ ప్రవీణ్ తనపై దాడి చేశాడని, అకారణంగా దూషించారని వాంగ్మూలం ఇచ్చారు.అంతేకాక తన వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్,ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారని పేర్కొన్నారు. ఈ ఘటనను గోదావరిఖని న్యాయవాద సంఘ సభ్యులకు తెలియజేయగా, వారు మద్దతుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారని తెలిపారు. అక్కడికి వచ్చిన సీఐ ఇంద్రసేనారెడ్డి మరోసారి న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి, “న్యాయవాదులకు కొమ్ములు ఉంటాయా” అంటూ దుర్భాషలాడుతూ బెదిరించాడని ఆరోపించారు. ఈ ఘటనలన్నింటినీ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఈ మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ ఎన్నికల అధికారి శరత్ బాబు, గన్‌మెన్ ప్రవీణ్‌లపై BNSS చట్టంలోని సెక్షన్లు 133, 61(2)(b), 356(2), 351(2) r/w 3(5) ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. కోర్టు CF.No 93/2026 కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా, న్యాయవాదిపై దాడి ఘటనతో పాటు వన్ టౌన్ సీఐ ప్రవర్తనపై గోదావరిఖని న్యాయ వాదులు చేపట్టిన నిరసన మంగళవారం నాటికి నాల్గవ రోజుకు చేరుకుంది. న్యాయవాదుల ఆందోళనల కారణంగా గోదావరిఖనిలోని మూడు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా న్యాయస్థానాల్లో కోర్టు విధులు స్తంభించిపోయాయి.అధికార దుర్వినియోగం చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న సీఐ ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత న్యాయవాది కోర్టును కోరారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Admin
Aakanksha News