Sunday, 27 September 2026 05:22:38 AM

ఆరు నూరైనా నురు ఆరైనా పథకాలు అమలు చేసి తీరుతాం...

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date : 04 April 2025 10:08 PM Views : 510

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : ఆరు నూరైనా నూరు ఆరైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుచేసితీరుతామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మంథని శివ కిరణ్ గార్డెన్ లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో 41,045 మంది కార్డుదారులున్నారని, ఈ పథకం అమలుతో 1,17,069 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు 15 రోజుల్లో ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగాలనే ఆలోచనతో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పించనున్నామని, ఈ నెల14 లోపు నిరద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టిందని, రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి తూకంలో కోతలు విధిస్తూ రైతులను నిలువు దోపిడీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన సన్నరకం దాన్యానికి ఎలాంటి తరుగు లేకుండా 500 బోనస్ కలిపి రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రానున్న రోజుల్లో ఆధునిక పద్ధతుల ద్వారా డ్రోన్లతో వ్యవసాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా మండలంలోని అడిసోనిపల్లిలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షం లేనిపోని రాద్ధాంతం చేస్తుందని ఎన్ని దుష్ట శక్తులు అడ్డు వచ్చినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో లో పొందపరచిన పథకాలను దశలవారీగా అమలు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, తహసిల్దార్ గిరి, టిఎస్ఐ చైర్మన్ కొత్త శ్రీనివాస్, డైరెక్టర్ సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రు రామ, కాంగ్రెస్ నాయకులు కాచే శశిభూషణ్, అయిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :