ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి బుధవారం రామగుండం మార్కండేయ కాలనీ ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ మాక్స్ విజన్ కేర్ ఆసుపత్రిలో వైద్యుడు లేనిది గమనించిన డీఎంహెచ్‌ఓ, అక్కడ వెంటనే ఆసుపత్రిని మూసి వేయించారు. వైద్యుల్లేని ఆసుపత్రి నడపడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.అదే విధంగా జనని ఆసుపత్రిలో డాక్టర్ కె. స్రవంతి 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సినప్పటికీ, ఆసుపత్రిలో లేరని సిబ్బంది వెల్లడించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు, ఇతర సిబ్బందికి తగిన విద్యార్హతలు లేవని పేర్కొన్నారు. సెల్లార్‌లోనే ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డులు నడుపుతూ, అనారోగ్యకర వాతావరణాన్ని కల్పిస్తున్నారని వెల్లడించారు. తదుపరి తనిఖీల్లో, ఆపరేషన్ థియేటర్, కారిడార్ తదితర ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో రిజిస్టర్డ్ కన్సల్టెంట్ డాక్టర్ల స్థానంలో ఇతరులు సేవలు అందిస్తున్నారని, ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని వివరించారు.ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా జనని ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నోటీసు జారీ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆసుపత్రిలో అపెండిసెక్టమీ చేసిన రోగి డిశ్చార్జ్ అయ్యేంత వరకూ ఆసుపత్రిని తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు.అలాగే ఆసుపత్రి నిర్వహణలో మార్పులు చేయాలంటే, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి ముందుగా అనుమతి పొందాల్సిన అవసరం ఉందని, లేకపోతే అది నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించబడుతుందని డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి స్పష్టం చేశారు.ఈ తనిఖీల నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Admin
Aakanksha News