ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మల్యాల–పోచంపల్లి గ్రామాల మధ్యనున్న నక్కల ఒర్రెపై తక్షణమే వంతెన నిర్మించాలని గ్రామస్తులు, స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్థులు కలిసి నక్కల ఒర్రెను పరిశీలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలంలో ఈ ఒర్రె దాటడం రైతులకు ప్రాణాపాయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్యాల గ్రామ రైతుల వ్యవసాయ భూములు ఎదురుపక్క ఉన్నందున ప్రతిసారి ఒర్రె దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు సమస్యను చెప్పినా నామమాత్రపు పనులు చేసి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి నుండి ఓదెల మల్లిఖార్జున దేవస్థానం వరకు రూ.10 కోట్ల నిధులతో రహదారి మంజూరు అయినప్పటికీ, పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని తెలిపారు. ఆ రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేసి, నక్కల ఒర్రెపై వంతెన నిర్మిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు నిదానపురం దేవయ్య, కర్ణాకర్‌రావు, వేల్పుల సంపత్, కామిడి వెంకట్‌రెడ్డి, జక్కె విష్ణు, ఎరబాటి రవి, లెక్కల వేణుగోపాల్రెడ్డి, కల్లెపెల్లి సాగర్, రాపర్తి సుజాత, ధర్ముల రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News