Tuesday, 11 August 2026 03:55:33 PM

రూ.10 లక్షలు కలెక్టర్‌కి ఇవ్వాలని డీడబ్ల్యువోనే స్పష్టంగా చెప్పాడు... ఇది అబద్ధమైతే ముక్కు భూమికి రాస్తా..

నేను వికలాంగుడినని చూడకుండా, నా మనోభావాలను దెబ్బతీసేలా డీడబ్ల్యువో ఎగతాళి చేసారు...ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య

Date : 21 September 2025 06:04 PM Views : 592

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌కు చెందిన ఎం.డీ.హెచ్‌.డబ్ల్యూఎస్‌ అనాథ పిల్లల ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య ఆదివారం ఆశ్రమ చిన్నారులతో కలిసి గాంధీనగర్‌ కు వెళ్లే బస్టాండ్‌ రోడ్డుపై ఆందోళనకు దిగారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను అమలు చేయమని కలెక్టరేట్‌ వెళ్లితే, రూ.10 లక్షలు ఇవ్వకపోతే భూమి కేటాయింపు జరగదని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం?" అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..20 ఏళ్లుగా అనాథ పిల్లలతో ఆశ్రమం నడుపుతున్నాను. 2017లో అప్పటి కలెక్టర్ దేవసేన స్వయంగా మా ఆశ్రమానికి వచ్చి సర్వే నంబరు 706లోని 10 గుంటల భూమిని సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించాలని లేఖ రాశారు. ఆ స్థలం మా ఆశ్రమానికి కేటాయించేందుకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దాంతో మేము అక్కడ షెడ్డు నిర్మించుకున్నాం. అయితే సింగరేణి అధికారులు వచ్చి దానిని కూల్చేసి ఆస్తినష్టం కలిగించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నేను హైకోర్టుకు వెళ్లాను. కోర్టు స్పష్టంగా 10 గుంటల భూమి ఆశ్రమానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.దీనిపై గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆ భూమి కేటాయింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన బదిలీ కావడంతో ఫైలు కదలలేదు. రెండు సంవత్సరాలుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. నేను వికలాంగుడినని చూడకుండా, నా మనోభావాలను దెబ్బతీసేలా డీడబ్ల్యువో ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఈ ఏడాది జూన్‌లో మళ్లీ కలవగా, హైకోర్టు ఆర్డర్ అమలు కావాలంటే రూ.10 లక్షలు కలెక్టర్‌కి ఇవ్వాలని డీడబ్ల్యువోనే స్పష్టంగా చెప్పాడు. లేకపోతే కోర్టుకే వెళ్లి వాళ్లను అడగమని వెనక్కి పంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కలెక్టరేట్‌ నుంచి అధికారులు వచ్చి మా ఆశ్రమంలోని పిల్లలను బలవంతంగా కార్లలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాతే వారిని తిరిగి పంపించారు. ఇలాంటి వేధింపులు తాళలేకపోతున్నాను. ఇకనైనా న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుటే ముక్కుభూమి రాస్తా" అని హెచ్చరించారు.ఆశ్రమ చిన్నారులు మోకాళ్లపై కూర్చొని "అయ్యా కలెక్టర్ సారు, మా భూమి మాకే ఇవ్వండి" అంటూ దండాలు పెట్టి వేడుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానిక బస్తీవాసులు పెద్ద సంఖ్యలో చేరి రాజయ్యకు మద్దతుగా నిలబడ్డారు. "అనాథ పిల్లల కోసం కేటాయించిన స్థలం ఇంతకాలం ఇవ్వక పోవడమే కాకుండా, లంచం డిమాండ్ చేయడం దారుణం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఢిల్లీలోని వికలాంగుల హక్కుల కమిషన్‌కు, రామగుండం పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం స్థానికుల జోక్యంతో ఆందోళన విరమించినా, న్యాయం కోసం తాను పోరాటం కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :