Saturday, 11 April 2026 01:18:11 AM

సీఐ ఇంద్రసేనారెడ్డిపై ఫిర్యాదులు కేవలం కాగితాలకే పరిమితమా...? సీఐపై చర్యలు తీసుకోకుండా న్యాయ వ్యవస్థకు సవాలు విసురుతున్న ఉన్నతాధికారులు....

ఎన్ని సంఘటనలు జరిగినా సిఐపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల విఫలం... సీఐపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు...

Date : 22 February 2026 09:13 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో I టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిపై వరుస ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పలుమార్లు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందినా అవి కేవలం కాగితాలకే పరిమితమైపోయాయని స్థానిక న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే సాధారణంగా విచారణ జరిపి చర్యలు తీసుకునే విధానం ఉండగా, గోదావరిఖని I టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విషయంలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాల మధ్య తాజాగా దళిత న్యాయవాది మార్కపూరి తిలక్‌పై జరిగిన దాడి ఘటన మరింత సంచలనం రేపింది. ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం కోర్టు పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సీఐ ఇంద్రసేనారెడ్డి తన గన్‌మెన్‌లతో కలిసి అడ్డగించి దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆరోపించారు. తన వద్ద ఉన్న రూ.47,500/- కోర్టు వ్యవహారానికి సంబంధించినదని చెప్పినా వినిపించకుండా తన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, క్లయింట్లతో మాట్లాడి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించగా సీఐ అనుచరుల్లో ఒకరు తనపై దాడి చేసి నుదిటిపై గాయాలు కలిగించారని తెలిపారు.అనంతరం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి పంచనామా నిర్వహించినప్పటికీ దాడి వివరాలను నమోదు చేయలేదని, అక్కడ ఉన్న న్యాయవాదులు కోరినా పట్టించు కోలేదని బాధితుడు ఆరోపించారు. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ రసీదు ఇవ్వలేదని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారం తనపై అధికార దుర్వినియోగం, అవమానం, బెదిరింపు, అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అట్రాసిటీగా పరిగణించాల్సిన ఘటనగా పేర్కొన్నారు.ఈ ఘటనపై బాధిత న్యాయవాది మార్కపూరి తిలక్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయిస్తూ అధికారికంగా ఫిర్యాదు చేశారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, అతని గన్‌మెన్‌లపై ఎస్సీ,ఎస్టీ చట్టం, 1989 కింద కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని, నిష్పక్షపాత విచారణ జరిపి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం తన మౌలిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని కూడా ఆయన పేర్కొన్నారు.ఇక సీఐ ఇంద్రసేనారెడ్డిని రక్షించేందుకు కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు, అలాగే కొందరు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఒక పోలీస్ అధికారిపై ఇంత తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోక పోవడం న్యాయ వ్యవస్థకు సవాలుగా మారిందని న్యాయవాదుల వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ ఘటనపై గోదావరిఖని న్యాయవాదుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీఐపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారి, ఉన్నతాధికారుల వైఖరిపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :