ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : "రైతే వెన్నెముక" అని అందరూ అంటారు, కానీ ఆ రైతులు వ్యవసాయం చేసేందుకు వెళ్లే దారుల పరిస్థితి చూస్తే శోచించక తప్పదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లే మార్గాలు పూర్తిగా చెదిరిపోయి, వర్షాకాలం సమీపిస్తున్న ఈ సమయాన దారులు పచ్చి మట్టి గుంతలతో మారిపోయాయి. గ్రామస్థుల మాటల్లో చెప్పాలంటే, "కత్తి మీద సామె" అన్నట్టుగా మారింది పరిస్థితి. కనీసంగా బైక్ కూడా వెళ్లలేని స్థితి నెలకొంది.ఎస్సీ కాలనీ నుంచి మానేరు వాగు దాకా, వైకుంఠధామం నుండి ఎల్లమ్మ గుడి దాకా, ఊర మర్రిచెట్టు నుంచి గొల్లపల్లి దాకా వెళ్లే దారులు పూర్తిగా నీళ్లలో మునిగి మిగిలింది కేవలం మట్టితో నిండిన ప్రమాదకర మార్గాలు మాత్రమే. ట్రాక్టర్లు చలనం కోల్పోయి బోల్తా పడిన ఘటనలు ఇప్పటికే జరిగాయి. "పండిన పంటల బస్తాలు మోయడమే కష్టం, కూలీలు రావడానికి కూడా భయపడుతున్నారు," అంటూ రైతులు వాపోతున్నారు.ఈ మార్గాల్లో వృత్తిరీత్యా ప్రయాణించే గౌడ కులస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరుకు సాగు, పశువుల మేత, రోజువారి దినచర్యలో భాగంగా ఈ దారులు అత్యంత ముఖ్యమైనవే. ఇప్పుడు ఈ రహదారుల పరిస్థితి తమ జీవితాలకే ప్రమాదమని చెబుతున్నారు. రైతులు పేర్కొంటున్న దానికి ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మత్తులు జరగలేదు. స్థానికంగా ఉండే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదని ఆరోపిస్తున్నారు.గ్రామాభివృద్ధికి నిధులు మంజూరై ఉంటే, అవి ఎక్కడ వినియోగించ బడ్డాయన్నది ప్రశ్నగా మిగిలిపోతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వానలు పెరిగితే ఈ దారులన్నీ పూర్తిగా మిగిలేది జలమయం గుంటలే అని అప్పటికి పసుపు, వరి, మిరప వంటి పంటల్ని వ్యవసాయ భూములకు చేర్చడమేకాకుండా తీసుకురావడమూ అసాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు. రైతులు తమ ధాన్యం అమ్మకానికి మార్కెట్‌కు తీసుకెళ్లలేని పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలికంగా అయినా మొరం వేయించి దారుల మరమ్మతులు చేపట్టాలని లేకపోతే వర్షాకాలంలో ఈ మార్గాలు ప్రాణహాని కలిగించే స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "మనుషులు, యంత్రాలు కాదు.. మట్టిలో మునిగిపోయే ప్రయాణాలివి," అని ఓ రైతు ఆవేదనతో తెలిపారు. అదే విధంగా రైతులే కాక, గ్రామస్తుల ఆరోగ్య సమస్యలు, ఆవాసాల తడిసిపోకూడని భయం, పిల్లల చదువు మీద కూడా ప్రభావం పడుతోందని స్థానిక మహిళలు తెలిపారు. "ఇలాగే కొనసాగితే పిల్లల్ని పాఠశాలకు పంపే పరిస్థితి ఉండదని ఒక తల్లి వాపోయింది.
ఇప్పటికైనా స్పందించండి..!
రైతుల ఆక్రందనను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాభివృద్ధి మాటలకే పరిమితమవకుండా ఆచరణలోకి రావాలంటున్నారు. ఇది కేవలం పొలాల దారి కాదని… జీవనదారి అని రైతులు అంటున్నారు.
Admin
Aakanksha News