ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 800 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ప్రకటించి ప్రజలను ఆకర్షించిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందని కోరుకంటి చందర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరుతో ఆదినాయకత్వం ప్రజల ముందుకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ, వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా అసెంబ్లీలో బడ్జెట్ రూపకల్పన సమయంలో హామీల అమలుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే స్పష్టమైన వైఖరి అవలంబించాలని ఆయన సూచించారు.అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చర్చించి, దానికి చట్టబద్ధత కల్పించేలా ఒత్తిడి తేవాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వం రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అభయ హస్తం సహా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని కోరుకంటి చందర్ తెలిపారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు మద్దతు తెలపాలని పిలుపు నిచ్చారు.తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.ఇది ప్రజాస్వామ్యానికి, రాజకీయ విలువలకు అనుకూలమైన ధోరణి కాదని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు దారి మళ్లించే రాజకీయాలు చేస్తోందని, కానీ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని కోరుకంటి చందర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వం పట్ల భవిష్యత్తులో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.ఈమీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News