Monday, 16 June 2025 02:31:34 AM

రాజకీయాల్లో నాటి విలువలు...నేడెక్కడ....? ఏ అంశమైన పరుష పదజాలం వాడుతున్న వైనం...

సోషల్ మీడియా వేదికగా బూతు పురాణం.... సోషల్ మీడియా కట్టడిలో అధికారుల చర్యలు శూన్యమేనా..

Date : 29 April 2025 10:38 AM Views : 492

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి ఉద్రేక రాజకీయాల వైపు నేతల ప్రయాణం సాగుతోందన్న భావన సర్వత్రంగా వ్యక్తం అవుతుంది. ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసుకునే రాజకీయ పార్టీలు మారుతున్న కాలంతో పాటుగా పార్టీలు కూడా తమ పంధాను మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. ఉద్రేక రాజకీయాలు చేస్తే రాజకీయంలో హీరోయిజంగా భావించే నేటి రాజకీయ వ్యవస్థలో నాయకులు కూడా అదే పంధాను అనుసరిస్తున్నారు. హత్యకు ప్రతి హత్య అన్న చందంగా రాజకీయాలు వ్యక్తిగతమవుతున్నాయి. ఒకప్పుడు స్వేచ్ఛ స్వతంత్రం కోసం... తెలంగాణ సాయుధ పోరాటం సాగించి అవి సాధించుకున్నాం... ఆ తర్వాత రాజకీయాల్లో ప్రతిపక్షాలు సైతం ప్రజా సమస్యల కోసం నిరసన పోరాటాలు చేశాయి. అందుకు అనుగుణంగా పాలకపక్షాలు సమస్యలను పరిష్కరించాయి. ఇది నాడు రాజకీయ నాణానికి ఒకవైపు అయితే నాణానికి మరో కోణమే నేటి రాజకీయ పోకడలు పార్టీలు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు సైతం వ్యక్తిగత ప్రతిష్టలకు పోతుండడంతో సమస్యలపై పోరాటాలు తగ్గుతున్నాయి.సమస్యల సాధన కోసం గొంతేత్తిన స్వరాలను మూగబోయే విధంగా చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో విడివిడి జ్ఞానం (సగం మెదడు) కలిగిన కొంత మంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే విధంగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తూ కొందరు నాయకులు క్షుద్ర రాజకీయానికి తెరతిస్తున్నారనే భావన సగటు మనుషులలో వ్యక్తం అవుతుంది. "పంచదార తినడానికి తీయగా ఉంటుంది... కానీ పైత్య రోగికి అది చేదుగా అనిపిస్తుంది. కానీ చేదు పైత్య ప్రభావం వల్ల వచ్చిందే అని గమనించరు" అనే సామెత నేటి రాజకీయ వ్యవస్థలో కొంత మంది నాయకులకు సరిగ్గా సరిపోతుంది.. అయితే నేడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ నియోజకవర్గంలో ఎలా ఉన్న రామగుండం నియోజకవర్గంలో మాత్రం ఈ జాడ్యం విసృ0ఖాలంగా మారుతుంది. అధికార పార్టీ ఒక విధంగా వాక్యాన్ని ఇస్తే అదే రీతిన ప్రతిపక్షాలు తిప్పి కొడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్న వారి వైపే అధికారులు ఉంటారన్న విమర్శలు రాజకీయంగా లేకపోలేదు.అదే రీతిలో ప్రతిపక్షాలు కూడా పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలపై జరుగుతున్న రాజకీయ వికృత చేష్టలు హద్దులు మీరుతున్నాయి. రాజకీయపరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వైపు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని జీవితంలో వ్యక్తిగత విషయాలను సంబోధించడం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుంది. రాజకీయాల్లో ఒకప్పుడు పరోక్షంగా ఆరోపణలు చేసుకునే స్థాయి నుండి ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా తిట్టుకునే స్థాయికి రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.

సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం...

ఉద్రేక రాజకీయాలకు కేంద్ర బిందువుగా సోషల్ మీడియా వ్యవహరిస్తుంది. ఎక్కడ సంఘటన జరిగినా, లేక ఎటువంటి రాజకీయ కార్యక్రమమైన ఆయా పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడటం రాజకీయపరంగా దుమారాన్ని కలిగిస్తుంది. దీనికి తోడు ప్రధాన రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారిగా సోషల్ మీడియా ఉండటంతో వారి చర్యలు ఇష్ట రాజ్యాంగా మారిపోతున్నాయనే ప్రచారం సాగుతుంది.

మారుతున్న రామగుండం రాజకీయాల పరాకాష్ట...

సాంప్రదాయ రాజకీయ విలువలతో ముడిపడిన ఉమ్మడి నగర్ జిల్లాలో రామగుండం రాజకీయాలకు ప్రత్యేక పేరు ప్రఖ్యాతి ఉంది. అయితే కొంతమంది అనాలోచిత విడివిడి జ్ఞానం కలిగిన నాయకుల వల్ల రాజకీయాలు ఉద్రేక రాజకీయాలుగా మారి బూతుల రాజకీయంగా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని నిత్యం సోషల్ మీడియాలో ఇతర పార్టీలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేస్తూ శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలను, వారి నాయకులు చేసే అభివృద్ధి పనులను నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాల్సింది పోయి అదే సోషల్ మీడియాలో ఇతర పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విడివిడి జ్ఞానం కలిగిన రాజకీయంతో గందరగోళ పరిస్థితులకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం మాట్లాడుతున్న సమయంలో దానిపై వస్తున్న వ్యతిరేకతను కొంత మంది నాయకులు గుర్తించుకోకుండా తెలివి తక్కువ తనంతో పార్టీకి నష్టం కలిగించే విధంగా చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల తమ అధినాయకత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై తమ అధినాయకత్వం పునరలోచించుకొని ఉద్రేక వ్యక్తిగత రాజకీయాలకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో తమ పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలని పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :