ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్‌లో కార్మికుల ఆరోగ్య పరీక్షలు, సేవారిత్యాగ నిర్ణయాలకు కీలకమైన మెడికల్ బోర్డులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఒకప్పుడు నెలకు ఒకసారి నిరంతరంగా జరిగే బోర్డు సమావేశాలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.చూస్తూ ఊరుకోదు సరే…అంటూ సింగరేణి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ బోర్డు నిలిచిపోవడం వల్ల అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు, లేదా సేవారహితులుగా గుర్తింపునకు ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రతి ఏరియాలో నెలకు కనీసం ఒకసారి జరగాల్సిన మెడికల్ బోర్డులు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అన్నదే పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఉన్నతాధికారుల స్థాయిలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయా లేక బడ్జెట్, సిబ్బంది కొరత కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సింగరేణి ఉద్యోగులు ఇది ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక గుర్తింపు సంఘం విషయానికి వస్తే, కార్మికులు నమ్మి గెలిపించిన ఆ సంఘం ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది.ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, ఇప్పుడు మాత్రం మాట మార్చుతున్నారు. మెడికల్ బోర్డులు ఎప్పుడు జరుగుతాయో మాకు తెలియడం లేదు అని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. గుర్తింపు సంఘం నాయకత్వం ఈ అంశంపై ఎప్పటి నుంచో నిశ్శబ్దం వహిస్తోంది. కార్మికుల సమస్యలపై గళమెత్తాల్సిన వారు నేటి పరిస్థితుల్లో మౌనాన్ని ఎంచుకున్నారు. నమ్మి గెలిపించిన వారికి ఇది సమాధానమా?” అని ఓ సీనియర్ కార్మికుడు ప్రశ్నించాడు. మెడికల్ బోర్డులు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. మెడికల్ బోర్డు లేకపోవడం వల్ల అనారోగ్య కార్మికులు రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడంలో జాప్యం ఎదుర్కొంటున్నారు. కొందరికి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి అంశాలు కూడా ఆగిపోయాయని పలువురు కార్మికులు తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువ కార్మికులు కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు మెడికల్ బోర్డు జరగకపోతే రేపు ప్రమోషన్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై కూడా ఇదే విధంగా ఆలస్యం జరుగుతుందేమో?” అన్న అనుమానం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మెడికల్ బోర్డులు తిరిగి ప్రారంభమవుతాయా లేదా ఈ విధంగానే నిలిచిపోతాయా అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లభించలేదు. గుర్తింపు సంఘం తరఫున ఎవరు మాట్లాడతారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనే అనేక సందేహాలు సింగరేణి కార్మికుల్లో వ్యాపించాయి. ఎందుకు మెడికల్ బోర్డులు నిలిచిపోయాయి ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు అధికారికంగా ఎవరైనా సమాధానం చెబుతారా గుర్తింపు సంఘం నిశ్శబ్దానికి కారణమేంటి నమ్మి గెలిపించిన కార్మికులకు ఏం సమాధానం ఇస్తారు ఇవి కేవలం ప్రశ్నలే కాకుండా వేలాది సింగరేణి కార్మికుల మనసులో కదిలే ఆవేదనలుగా మారాయి. సింగరేణి చరిత్రలో కార్మికుల సంక్షేమం ఎప్పుడూ ప్రధానాంశం. కానీ తాజా మెడికల్ బోర్డుల నిలిపివేతతో ఆ నమ్మకం బలహీనమవుతోంది. అధికార యంత్రాంగం, గుర్తింపు సంఘం ఇద్దరూ నిశ్శబ్దం వహిస్తే, కార్మికులు తమ బాధను ఎవరికీ చెప్పాలి రాబోయే రోజుల్లో కంపెనీ యాజమాన్యం, గుర్తింపు సంఘం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే సింగరేణి పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్నదని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సింగరేణిలో మెడికల్ బోర్డుల నిలిపివేత కేవలం పరిపాలనా సమస్య కాదు వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి.
Admin
Aakanksha News