ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండంలో నేపాల్ ప్రధాని ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు చట్టాలు తనకు అనుకూలంగా చుట్టాలుగా మారాయని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి పాల్గొని మాట్లాడుతూ...ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలనపై మండిపడ్డారు.21 నెలలుగా అరాచక పాలన సాగుతుందని, కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతలు అవగాహన ఉండి జరుగుతున్నాయా లేక కక్ష సాధింపు చర్యలతో జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు. గత సింగరేణి లాభాల వాటాలో 2వేల కోట్లు అదృశ్యమైపోయాయని, ఆ డబ్బు ఎవరింటికి వెళ్లిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఓసీపీలో 600 మందిని తొలగించి మళ్ళీ 800 మందిని పిలిపించడం వెనుక అంతర్గత రహస్యం ఏమిటో బహిర్గతం చేయాలని కోరారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న పాలన తీరుపై మండిపడిన చందర్, “నేపాల్‌లో ప్రజలు అరాచక పాలనను భరించలేక ప్రధాని సీటు దింపేశారు. రామగుండంలో కూడా అదే గతి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కి పడుతుందని హెచ్చరించారు.సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇప్పటికీ ప్రకటించలేదని ఆయన విమర్శించారు. ఒకరు షాపులకు పర్మిషన్ ఇస్తే మరొకరు వచ్చి కూల్చేస్తున్న పరిస్థితి నెలకొన్నదని, దీంతో చిరు వ్యాపారులు నష్టపోతున్నారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఎవరైనా ఎమ్మెల్యేను అతిథిగా పిలిస్తే ఎక్కడ కూల్చివేతలు జరిగిపోతాయేమోనన్న భయం ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు. “మీరు గోదావరిఖనిని ఏం చేయదలుచుకున్నారు..? అసలు మీ ప్రణాళిక ఏమిటి..? ప్రజలకు బహిరంగంగా వివరించండి” అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను సవాల్ చేశారు.అలాగే, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాలేరులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. సోమవారం బంద్‌తో పాటు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రామగుండంలో అసలు ఎవరు కులగోడుతున్నారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండి చిరు వ్యాపారులు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. సింగరేణి కార్మికులకు ఇస్తానన్న సొంతింటి కల ఏమైందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేకు లేని విధంగా రామగుండం ఎమ్మెల్యేకు గుణపాఠం జరుగుతుందని విమర్శించారు. అక్కడ రేవంత్ రెడ్డి కూల్చివేతలతో రాష్ట్రాన్ని విచ్చిన్నం చేస్తుంటే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండంలో కూల్చివేతలతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇకపై రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన చిరు వ్యాపారుల అండగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.
Admin
Aakanksha News