ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం అనుసరించబోతున్న ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తాజాగా స్పందించారు.నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజవర్గాలు విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా.. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి పరిస్థితిని తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని.. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామని విజయ్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు..కేవలం జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ సీట్లను నిర్ణయించరాదు అని కేంద్రాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే కోరారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే, దాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉందని, కేవలం జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగవద్దు అని, జనాభా నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఆ రాష్ట్రాలను శిక్షించవద్దు అని కేంద్రానికి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణపై తమిళనాడు దృష్టి పెట్టి విజయం సాధించిందని, ఇప్పుడు రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి అదే కారణమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అందుకే పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలని తమిళ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన సమస్య తమిళనాడు హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిందని, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే పరిగణించలేమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
Admin
Aakanksha News