ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రుల సమావేశం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే స్టేజీపై ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం చివరకు ఘర్షణకు దారితీసింది. సభా వేదికపైనే ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం పార్టీ శ్రేణులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.ఒకే డివిజన్‌కు చెందిన ఇద్దరు నాయకుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు ఈ సమావేశంలో బహిరంగంగా బయటపడినట్లుగా కనిపిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైన వేదికపై ఇలాంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. “ఇదేనా సభా మర్యాదలు..? ఇదేనా మంత్రులకు ఇచ్చే గౌరవం? స్థానిక ఎమ్మెల్యేకు ఇచ్చే విలువ ఇదేనా?” అంటూ పలువురు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ ఘర్షణలో పాల్గొన్న ఓ నాయకుడిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతూ, ఎమ్మెల్యే పేరును వినియోగించి వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నాడన్న విమర్శలు గతంలోనూ వినిపించాయి. పార్టీ ప్రతిష్టను భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇటీవల గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన కూల్చివేతల వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే పేరుతో గుర్తుతెలియని వ్యక్తితో ఫోన్ మాట్లాడిస్తూ వివాదాస్పదంగా మారిన సదరు నాయకుడు, ఈసారి మంత్రుల సమావేశ వేదికపైనే ఘర్షణకు దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఆయన ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, అయినా స్థానిక నాయకులు ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జిల్లా మంత్రులు పాల్గొన్న సమావేశాల్లో నాయకులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్టేజీపై ఘర్షణకు దిగడం పార్టీకి ఎంత నష్టం చేస్తుందన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంత జరిగినా, పలు సంఘటనలు పునరావృతమైనా, సదరు నాయకుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వార్త కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో
Admin
Aakanksha News