Saturday, 26 September 2026 07:43:34 PM

పార్కింగ్‌ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్‌...

మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ కీలక ప్రకటన

Date : 21 May 2025 06:15 AM Views : 808

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ కీలక ప్రకటన చేశారు. కొనుగోలుదారు పార్కింగ్‌ స్థలం చూపించకుంటే తమ వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయబోమని ప్రకటించారు. తాము కొన్న వాహనానికి పౌర సంస్థ కేటాయించిన పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను చూపిస్తేనే రిజిస్ట్రేషన్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజన్‌లో పార్కింగ్‌ కొరత తీవ్రంగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు పార్కింగ్‌ ప్లాజాల నిర్మాణాన్ని అనుమతించడానికి పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు.మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం వెలువరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పార్కింగ్‌ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే (Car Parking) నిబంధనను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన ఫ్రూఫ్‌ చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ తాజాగా ప్రకటించారు.‘నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్‌ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్‌ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సివస్తోంది. అంతేకాకుండా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన పెట్టాం’ అని ఈ ఏడాది ఆరంభంలో ప్రతాప్ సర్నాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :