Friday, 13 March 2026 01:24:38 AM

ఏసీపీ బెదిరింపులతోనే సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పేర్లను పింక్ బుక్‌లో నమోదు చేస్తున్నాం.

భవిష్యత్తులో పోలీస్ స్టేషన్ల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల బోర్డులు పెట్టాల్సి వస్తుంది. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర ఆరోపణలు

Date : 12 March 2026 06:54 PM Views : 164

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా మంథనిలో స్థానిక పోచమ్మ వాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్‌ ఆత్మహత్య ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సతీష్‌ ఆత్మహత్యకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం మంథని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో ఉన్న సతీష్‌ మృతదేహాన్ని ఆయన సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్‌ మాట్లాడారు.పెరుగు సతీష్‌ సుమారు 25 రోజుల క్రితం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ పిలిపించి వేధింపులకు గురిచేసిన కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించాడని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఎవరైతే తనను ఒక అమ్మాయి ఇబ్బంది పెడుతోందని చెప్పిందో ఆ అమ్మాయి లేకుండానే ఏసీపీ ఏకపక్షంగా సతీష్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడని సతీష్‌ సోదరి చెప్పినట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉదయం తీసుకువచ్చిన కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు ఎస్సై అక్కడికి రాకపోవడం, బాధిత కుటుంబ సభ్యుల నుండి దరఖాస్తు స్వీకరించకపోవడం బాధాకరమని పుట్ట మధూకర్‌ విమర్శించారు.రామగుండం పోలీసులు తమకు నచ్చిన విధంగా దరఖాస్తు రాసి ఇవ్వాలని హుకూం జారీ చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రామగుండం పోలీసులను అనేకసార్లు హెచ్చరించామని, పోలీసులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని సూచించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పోలీస్ స్టేషన్ల ముందు కాంగ్రెస్ కార్యాలయాల బోర్డులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అమాయకుల ప్రాణాలకు కారణమవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.ఏసీపీ మడత రమేష్‌, మంథని సీఐ ఎక్కడ ఉన్నా వారిపై చర్యలు తప్పవని పేర్కొంటూ వారి పేర్లను పింక్ బుక్‌లో నమోదు చేసి ఉంచామని చెప్పారు.నియోజక వర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,ఆయన కుటుంబ సభ్యులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తకు సమస్య ఎదురైతే మంత్రి స్వయంగా ముందుకు వచ్చి పరిష్కరించాల్సింది పోయి పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలంటే మంత్రి శ్రీధర్‌బాబుకు గౌరవం లేదనే విషయానికి సతీష్‌ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.తాను బీసీ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, ఈ సమాజం సమస్యలు తెలుసుకుని పోరాటం చేస్తున్నానని పుట్ట మధూకర్‌ తెలిపారు. తాను పదవుల కోసం లేదా ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని, బీసీ సమాజాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకునే రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.ఇటీవల సూరారం గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి మరణించిన ఘటనలో కూడా అక్కడి డీఎస్పీ అవహేళనగా మాట్లాడినట్లు ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న తాను మాట్లాడినా కూడా ఆ అధికారి స్పందించిన తీరు బాధాకరమని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఈ స్థాయికి దిగజారడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అమాయకులు రాజకీయ కుట్రలు, పోలీసు అరాచకాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని పుట్ట మధూకర్‌ అన్నారు. సతీష్‌ మరణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబం మరియు పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన ఆరోపించారు.తక్షణమే పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా వెంటనే స్పందించి ఈ ఘటనపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.సతీష్‌ మృతి చెందక ముందే మానవ హక్కుల కమిషన్‌లో కేసు పెట్టినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మంథని పోలీసులు వెంటనే ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించాలని అన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.సతీష్‌ కుటుంబానికి తాము అండగా నిలుస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్‌,తగరం శంకర్‌లాల్‌, మంథని లక్ష్మణ్‌, పుప్పాల తిరుపతి, సాగర్‌, పిల్లి సత్తన్న, కనకరాజులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :