Friday, 16 January 2026 08:53:48 AM

సీఐ వేధింపులు భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం...

Date : 04 November 2025 12:20 PM Views : 253

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ అఖిలపై అధికారిణి సీఐ జయశ్రీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం పట్టణంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెం ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అఖిలపై సీఐ జయశ్రీ కొంతకాలంగా మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ తనను సహచర సిబ్బందిలో వేరుచేసి అంటరానివారిగా వ్యవహరించడం, తాను ఎవరికైనా మాట్లాడినా వారిని బెదిరించడం వంటి చర్యలకు దిగిందని అఖిల ఆరోపించింది. నిరంతర వేధింపులతో మానసిక ఆవేదనకు గురైన ఆమె గత శుక్రవారం తన నివాసంలో టాబ్లెట్లు మింగి ప్రాణాలపై ప్రయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందించారు.చికిత్స అనంతరం అఖిల తన కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుతూ సీఐ జయశ్రీ వేధింపుల గురించి మీడియాకు వివరించింది. ఈ సంఘటనతో ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కొత్తగూడెం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. “అఖిలకు న్యాయం చేయాలి”, “సీఐ జయశ్రీపై చర్యలు తీసుకోవాలి” అంటూ నినాదాలు చేశారు.ధర్నా కారణంగా కొంతసేపు కార్యాలయ కార్యకలాపాలు స్థంభించాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను సాంత్వన పరచి, విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.ఇక ఈ ఘటనపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు నివేదిక కోరగా, సీఐ జయశ్రీపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ సంఘటనతో ఎక్సైజ్ శాఖలో మహిళా సిబ్బందిలో ఆందోళన వ్యాపించింది. “ఉద్యోగం కోసం కష్టపడి చేరితే వేధింపులు ఎదుర్కోవాలా?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగూడెం పట్టణంలో ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :