Sunday, 27 September 2026 08:21:52 AM

కన్నీటిపర్యంతమైన కొత్త జీవితం... ఆరు రోజుల ప్రేమవివాహం…

యువతి ఆత్మహత్యతో విషాదం...

Date : 04 October 2025 07:15 PM Views : 688

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఆరురోజుల క్రితం ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. కోరుకున్నోడిని వివాహం చేసుకున్న ఆనందం నిలవకముందే ఇలాంటి విషాదం సంభవించడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఎర్దండి శివారులోని ఒడ్డెర కాలనీలో నివసించే బోదాసు గంగోత్రి (22), అదే కాలనీకి చెందిన అల్లిపు సంతోష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో గత నెల 26న ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత కొత్తజంట ఆనందంగా గడుపుతుందని ఊహించిన కుటుంబసభ్యులు ఇప్పుడు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్త సంతోష్‌తో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ రోజు కుటుంబ సభ్యులతో భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పెద్దలు సర్దిచెప్పడంతో సంతోష్ తన భార్యను వెంట తీసుకొని తిరిగి అత్తింటికి వెళ్ళాడు. అయితే, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గంగోత్రి తండ్రి ఫిర్యాదులో “మా కూతురు భర్తతో గొడవ కారణంగా మనస్తాపానికి గురై ఉంటుందేమో, లేదా అత్తింట్లో ఏదైనా ఇబ్బంది ఎదురై ఉండొచ్చు” అని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.సిఐ అధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా పెళ్లయిన యువతి ఇంత తక్కువ సమయంలో ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. బంధుమిత్రులు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. "కొత్త జీవితం మొదలుపెట్టిన మా అమ్మాయి ఇలా వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు" అంటూ తల్లిదండ్రులు విలపించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తుతో గంగోత్రి ఆత్మహత్య వెనుక కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :