ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పి అంటూ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... రామగుండం నగరానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి సోమవారం అర్థరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో కడుపునొప్పి బాధతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్య సిబ్బంది చికిత్స అందించిన అనంతరం కూడా ఆసుపత్రి పరిధిలో తిరుగుతూ గడిపాడు.ఇదే సమయంలో ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న రాజేష్ అనే సిబ్బంది రోగులకు డ్రెస్సింగ్ చేస్తున్నపుడు, పక్కనే ఉంచిన తన మొబైల్ ఫోన్ ను వెంకటేష్ దొంగలించినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున ఫోన్ కనిపించకపోవడంతో సిబ్బంది అనుమానించి ఆ వ్యక్తిని గమనించారు. ఉదయం 6.30 గంటల సమయంలో వెంకటేష్ ఆసుపత్రి సమీపంలోని కళ్ళు దుకాణం వద్ద మద్యం సేవిస్తుండగా సిబ్బంది అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నారు. దొంగతనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిబ్బంది అతనికి దేహశుద్ధి చేసి, అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించి వెంకటేష్ ను వారికి అప్పగించారు.
Admin
Aakanksha News