ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్‌వైజర్ మహమ్మద్ తాజుద్దీన్ వ్యవహారం తీవ్ర విమర్శలకు గురవుతోంది. అధికారిక హోదాలో ఉన్నా అతని పని తీరుపై సిబ్బంది వాపోతుండటం, గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.అయితే ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్ సిబ్బంది అతని ప్రవర్తన వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు వాపోతున్నారు.. సిబ్బంది పని చేస్తుండగా ఫోటోలు తీసి బెదిరించడం, వ్యక్తిగతంగా వేధించడంతో పాటు పనిలో పదే పదే మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. మహిళా కార్మికురాలు ఒకరు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న సందర్భంలో అతను మాటలతో వేధించాడని పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.తాజాగా బాధిత మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ తాజుద్దీన్‌పై కేసు నమోదు అయింది. అయినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు స్పందన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. "ఇలాంటి వ్యక్తులు అధికార హోదాలో ఉండటం సిగ్గుచేటు" అంటూ పలువురు వాపోతున్నారు. అయితే ఆసుపత్రిలో అత్యంత బాధ్యతాయుతమైన పదవి అయిన సూపరింటెండెంట్ హోదాలో ఉన్న అధికారి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం తీవ్రంగా ఆవేదన కలిగిస్తోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. గతంలో కూడా ఆసుపత్రి సిబ్బంది, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది ఈ సూపర్వైజర్ తీరుపై తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా అందాయి. అయినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ పలుకుబడి ఉందని ప్రచారం జరుగుతుంది.అయితే తాజుద్దీన్‌కు అధికార పార్టీకి చెందిన ఓ నేత మద్దతుగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఆశ్రయంతోనే అతను అన్ని నియమాలు, నిబంధనలను దాటి ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య సిబ్బంది తుపాకీ మీద గురివిందలా చర్యలు ఎదుర్కొంటున్నా, ఈ సూపర్వైజర్ మాత్రం ఎలాంటి ససేమిరా లేకుండా అధికార పదవిలో కొనసాగుతుండటం స్పష్టంగా ఇద్దరికి ఒకే చట్టం పాటించట్లేదన్న సందేహాలను బలపరుస్తోంది.నిన్న మొన్నటి వరకు క్రమశిక్షణా చర్యలు చూసినప్పుడు మేము ఆశించాం – ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరుగుతుందని. కానీ తాజుద్దీన్ విషయానికి వస్తే ఆ నియమాలు పనిచేయడం లేదు. ఇదేంటి న్యాయం?” అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇది కాక మేము పని చేసేటప్పుడు అతను ఫోటోలు తీస్తాడు. చిల్లర కారణాల కోసం మాకు షోకాజ్ నోటీసులు ఇప్పిస్తాడు. కానీ అతను చేసే పనులకు ఎవరూ మాట్లాడటం లేదు.” అని పలువురు వాపోయారు. గతంలో ఆరోపణలు... ఈసారి కేసు నమోదు... ఇంతకుముందు కూడా ఈ సూపర్‌వైజర్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి మహిళా సిబ్బందిని మానసికంగా వేధించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం వంటి అనేక ఉదంతాలు ఉన్నాయని సమాచారం. అయినా ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడం వల్ల అతని ధైర్యం రెట్టింపయిందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఈసారి బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మౌనంగా ఉన్న అధికారులు... ఈ విషయంపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులూ మౌనమే వహిస్తున్నారు. పత్రికలు, టీవీ ఛానెళ్ళలో వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి విచారణ కానీ, నివేదిక కానీ లేదు. బాధితులకు న్యాయం జరగాలంటే పై స్థాయి చర్యలే మార్గమని కొందరు ఉద్యోగ సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.సూపర్‌వైజర్ వ్యవహారం ఆసుపత్రి వాతావరణాన్ని పూర్తిగా కలుషితంగా మార్చిందని పలువురు పేర్కొంటున్నారు. వైద్య సేవలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇలాంటి వ్యవహారాలు దెబ్బతీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ వ్యవహారంపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? బాధిత మహిళా కార్మికురాలికి న్యాయం జరుగుతుందా? ఆసుపత్రిలో సిబ్బందిపై భయపెడుతూ పెత్తనం చేసే ఈ సూపర్వైజర్‌కు ఆగమనమొస్తుందా? – అన్నది ప్రస్తుతం ఆసుపత్రి వర్గాల్లో కీలక చర్చగా మారింది.
Admin
Aakanksha News