ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జోగులంబ గద్వాల జిల్లా : ప్రేమలో నమ్మకద్రోహం విషాదాంతానికి దారితీసింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన యువకుడు చివరికి మాట తప్పడంతో యువతి మనస్థాపానికి గురై ప్రాణాల్ని తీసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక అనే యువతి, చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో గత కొన్నేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. పెళ్లి చేసుకుంటానని యువకుడు హామీ ఇవ్వడంతో ఆమె అతనిపై విశ్వాసం పెంచుకుంది. అయితే రెండు నెలల క్రితం ప్రియాంక పెళ్లి విషయమై ఆ యువకుడిని సంప్రదించగా, అతడు నిరాకరించాడు. దీంతో బాధతో ఆమె గద్వాల జిల్లా పోలీసులను ఆశ్రయించి చీటింగ్ కేసు నమోదు చేయించగా, ఆ కేసులో ఆ యువకుడు అరెస్టయి జైలుకు వెళ్లాడు.ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆ యువకుడిని మళ్లీ కలిసిన ప్రియాంక అతని ఇంట్లోనే ఉండసాగింది. అయితే మరోసారి పెళ్లి ప్రతిపాదనను ఆమె ముందుంచగా, అతడు తిరిగి నిరాకరించాడు. దాంతో ఆత్మవేదనతో ప్రియాంక రెండు రోజుల క్రితం పురుగుమందు తాగింది.తక్షణమే ఆమెను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శనివారం ఉదయం చికిత్స పూర్తయి తిరిగి గ్రామానికి చేరుకున్న ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ ఘటనతో చిన్నోనిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రియాంక మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి మృతి వెనుక ఉన్న నిజానిజాలను వెలికితీయడానికి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Admin
Aakanksha News