ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : ఇద్దరు ప్రేమించుకున్నారు.ప్రేమతో కలిసి జీవించాలని కలలు కన్న యువ హృదయాలు చివరకు చావునే శరణ్యంగా ఎంచుకున్నాయి. పెద్దల అంగీకారం లేకపోవడం, కుటుంబాల మధ్య ఏర్పడిన ఒత్తిడి, మానసిక వేదన… ఇవన్నీ కలిసి ప్రేమికుల ఆత్మహత్యకు ధరి తీశాయి.యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒక రోజు తేడాతో ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్యలకు పాల్పడటంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను సీఐ సత్యనారాయణ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పోతురాజు అలివేలు కూతురు పోతురాజు పూజ (16) ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పూజ తండ్రి పదహారేళ్ల క్రితమే మృతి చెందడంతో తల్లి అలివేలు కుమారుడు, కుమార్తెను కష్టపడి పెంచి పోషించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్ (20)తో పూజకు గత నాలుగు–ఐదు నెలలుగా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిని కలుసుకోకుండా కట్టడి చేశారు. ఈ పరిస్థితి ఇద్దరినీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసింది.ఇటీవల మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పూజ కూడా మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కూడా కుటుంబసభ్యులు రక్షించారు. అయినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో మానసిక వేదన మరింత పెరిగినట్లు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా మహేష్ పూజ తాత నారయ్యకు ఫోన్ చేసి “నేను ప్రేమించిన పూజతో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను” అంటూ బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం పూజకు తెలియడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. తన ప్రియుడు ఏ క్షణంలో ఏమి చేస్తాడోనన్న భయంతో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.పూజ మృతి వార్త మేడిపల్లి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. యువతి మృతితో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రియురాలు ఉరేసుకొని మృతి చెందిన విషయం తెలిసిన మరుసటి రోజు బుధవారం మహేష్ హయత్‌నగర్ పరిధిలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఒకే గ్రామానికి చెందిన ప్రేమజంట ఒక రోజు తేడాతో బలవన్మరణాలకు పాల్పడటంతో మేడిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. యువత మనస్తత్వం, కుటుంబ ఒత్తిళ్లు, పెద్దల అంగీకారం లేకపోవడం వంటి అంశాలపై గ్రామంలో చర్చ సాగుతోంది. ఈ ఘటనపై గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News