Thursday, 25 June 2026 08:06:22 PM

ప్రేమించిన వ్యక్తితో భార్యకు పెళ్లి చేసి భర్త ఆత్మహత్య....

– ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన విషాద ఘటన...

Date : 07 November 2025 01:44 PM Views : 1100

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సినిమా కథను తలపించేలా విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భార్యకు ఆమె ప్రియుడితో దగ్గరుండి వివాహం జరిపించిన భర్త, ఆపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.వివరాల్లోకి వెళితే... సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్ (28)లు ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గౌస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, ఇటీవల సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామానికి వలస వెళ్లి అక్కడ పోడు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో గౌస్ భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం బయటపడిన తరువాత గౌస్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయినా కుటుంబంలో కలహాలు పెరగకూడదనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరినీ ఒప్పించి,వారిద్దరి వివాహం జరిపించాడు. ఈ ఘటన సాక్షాత్ సినిమా కథలను గుర్తు చేసేట్టుగా మారింది.అయితే ఈ అసాధారణ సంఘటన అనంతరం గౌస్ మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడు.ఉదయం వీడియో కాల్ ద్వారా తన స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేసిన అతడు, ఆ వెంటనే తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.సత్తుపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి మరో పెళ్లి చేసుకోవడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు.ఈ ఘటనపై స్థానికులు కన్నీరుమున్నీరుగా స్పందిస్తున్నారు. “భార్య ప్రేమ వ్యవహారాన్ని సమాజం ముందుంచి పెళ్లి జరిపించడమే గౌస్ చివరి నిర్ణయం అవుతుందని ఎవరూ ఊహించలేదు” అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :