ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మంథని మండలంలో భారీ రేషన్ బియ్యం మోసం వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లై కార్పొరేషన్‌కు అప్పగించవలసిన బియ్యాన్ని ఇవ్వకుండా రూ.12 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీస్ పార్ట్నర్ బైర్నేని వరప్రసాద్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు.సీఐ రాజు తెలిపిన ప్రకారం..గద్దలపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌కు 2023–24 ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 38,489 క్వింటాళ్ల వడ్లు సివిల్ సప్లై కార్పొరేషన్ తరఫున అప్పగించబడినట్టు తెలిపారు. ఈ వడ్లకు బదులుగా 25,680.43 క్వింటాళ్ల బియ్యం అందజేయాలని ఒప్పందం జరిగింది. అయితే మిల్ పార్ట్నర్స్ అయిన ఏ–1 బైర్నేని వరప్రసాద్ రావు, ఏ–2 తాటిపెల్లి శ్రీనివాస్ అక్రమ లాభాపేక్షతో అగ్రిమెంట్‌ను దుర్వినియోగం చేసి, కార్పొరేషన్‌కు బియ్యం ఇవ్వకుండా మొత్తం రూ.12 కోట్లు 37 లక్షలు 8 వేల 59 రూపాయలు మోసం చేసినట్టు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.139/2024 కేసు నమోదు చేశారు. ఈ కేసును IPC సెక్షన్లు 406, 409, 420 కింద నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే నిందితుడు ఏ–2 తాటిపెల్లి శ్రీనివాస్‌ను గతంలోనే అరెస్ట్ చేసినట్లు సీఐ గుర్తుచేశారు. తాజా దర్యాప్తులో బైర్నేని వరప్రసాద్ రావును బుధవారం పట్టుకుని కోర్టులో హాజరుపర్చినట్టు వెల్లడించారు. మోసం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రాజు స్పష్టం చేశారు.
Admin
Aakanksha News