Sunday, 22 March 2026 12:58:21 AM

రణరంగమా.. రామగుండమా..! — గల్లీ స్థాయి లొల్లి ఢిల్లీ వరకు..!

కూల్చివేతలపై ఎన్ హెచ్ఆర్సీ, రాష్ట్రపతికి ఫిర్యాదు..

Date : 25 October 2025 10:32 AM Views : 5209

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నగరంలో కూల్చివేతల వివాదం మరింత ముదురుతోంది. హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్, సింగరేణి అధికారులతో పాటు ఒక ముఖ్య ప్రజా ప్రతినిధిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కి, రాష్ట్రపతికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో సంచలనం రేగింది. నగరంలో గల్లీ స్థాయి వివాదం ఇప్పుడు ఢిల్లీ దాకా చేరి రామగుండం వాతావరణాన్ని రణరంగంగా మార్చిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.ఓ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో కొందరు సింగరేణి, మున్సిపల్ అధికారులు తమ ఆధిపత్యం చూపిస్తూ ఇళ్లను అక్రమంగా కూల్చివేయిస్తున్నారన్న ఆరోపణలతో ఆ బాధితుడు రాష్ట్రపతి భవన్ కు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ ఫిర్యాదు రాష్ట్రపతి కార్యాలయం నుండి తెలంగాణ ముఖ్య కార్యదర్శి (సీఎస్)కు బదిలీ చేయబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పిటిషన్ దారుడిని కలసి నివేదికను సమర్పించాలని సీఎస్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పించిన ఫిర్యాదు కూడా గమనార్హమే. దానిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ అధికారులు తెలంగాణ డీజీపీకి దానిని పంపగా, అక్కడి నుండి రామగుండం పోలీస్ కమిషనర్‌కి, అనంతరం విచారణ నిమిత్తం డివిజనల్ మున్సిపల్ ఆఫీసర్‌కు ఈ నెల 16వ తేదీన రిఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ ఫిర్యాదు ఆధారంగా స్థానిక అధికారుల నుండి వివరణలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఎన్‌హెచ్‌ఆర్సీ,రాష్ట్రపతి కార్యాలయంకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హనుమాన్ నగర్‌లో రేకుల షెడ్లు ఏర్పాటు చేసి నివసిస్తున్న తానను, తమ కుటుంబ సభ్యులను కొంతమంది సింగరేణి, మున్సిపల్,ప్రజా ప్రతినిధికి సంబంధించిన వ్యక్తులు జీ ప్లస్ వన్ నిర్మాణం చేసుకోవాలని కొంత మంది లేదంటే రేకుల షెడ్డు ను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని అలాగే ఈ ఫిర్యాదు చేసిన నాకు ప్రాణభయం ఉందని ఏ క్షణమైనా ఎవరైనా మాపై దాడులు చేస్తారని ఇబ్బందులకు గురి చేస్తారని ఫిర్యాదుల పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో స్థానిక ప్రజా ప్రతినిధి పేరు కూడా ఉన్నట్టు సమాచారం. పిటిషన్ దారుడు తన ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు. ఇప్పటికే స్థానిక స్థాయిలో ఈ అంశం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.ఇక రామగుండం డివిజన్ మున్సిపల్ పరిధిలో ఇటీవలి నెలల్లో చోటు చేసుకున్న కూల్చివేతలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కూల్చివేతలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.రామగుండం మున్సిపల్ పరిధిలో ఇప్పుడు చట్టమే లేని రాజ్యంగా మారిందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇదే జరిగితే స్థానిక మున్సిపల్ అధికారులతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులపై విచారణ తాలూకు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.ఇక నగరంలో ఈ ఘటనతో రాజకీయ వర్గాలు కూడా సుడిగాలి చర్చల్లో మునిగిపోయాయి. గల్లీ స్థాయి నుండి ఢిల్లీ దాకా ఈ కేసు వెళ్ళడంతో “రణరంగమా.. రామగుండమా..!” అనే వ్యాఖ్యలు ప్రజల్లో మార్మోగుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :